విచారణకు తీసుకువచ్చిన ఓ అనుమానితురాలు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఓ దొంగతనం కేసులో దర్యాప్తులో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అంతకుముందు రోజు మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్, అతడి స్నేహితుడు వేముల శంకర్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో ప్రశ్నించడంతో రూ.1.35 లక్షలను వారి ద్వారా రికవరీ చేసినట్లు చెబుతున్నారు. మిగిలిన రూ.65వేల కోసం శుక్రవారం మరియమ్మను పిలిపించి ప్రశ్నించగా ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆమెను పోలీసు వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. కాగా ఈ విషయం బయటకు పొక్కకుండా సాయంత్రం వరకు గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. సాయంత్రం విషయం బయటకు రావడంతో ఎస్సైని వివరణ కోరగా.. దొంగతనం కేసు విచారణలో పీఎస్‌కు తరలిస్తుండగా ఆవరణలోనే స్పృహతప్పి పడిపోవడం వల్ల భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు ఎస్సై వి.మహేశ్ చెప్పారు.
పోలీసు వివరాల ప్రకారం...
గోవిందాపురం చర్చిఫాదర్ బాలశౌరి నివాసంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోనట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మ(55) వంట చేసేందుకు రెండు నెలల క్రితం చేరింది. ఈనెల 3న ఆమె కుమారుడు అంబడిపూడి ఉదయ్‌కిరణ్‌తో పాటు అతడి స్నేహితుడు వేముల శంకర్‌తో కలిసి గోవిందాపురంలోని తల్లివద్దకు వచ్చారు.
ఫాదర్ వారిని చూసి.. ఎవరని ప్రశ్నించగా.. రెండ్రోజులు పనిమీద వచ్చారని తెలిపింది. అనంతరం ఫాదర్ ఈనెల 5న పనిమీద హైదరాబాద్ వెళ్లారు. అదే రోజు నల్గొండలో ఉంటున్న ఫాదర్ బంధువు గోవిందాపురం వచ్చారు. ఇంట్లో ఉన్నవారిని చూసి.. ఫాదర్‌కు ఫోన్ చేశాడు. వారి ప్రవర్తనలో ఏదో తేడా ఉందని చెప్పడంతో.. వంటమనిషికి ఫాదర్ ఫోన్ చేశాడు. వారిని ఇంకా ఎందుకు పంపలేదని ప్రశ్నించాడు. ఈనెల 6న హైదరాబాద్ నుంచి తిరిగివచ్చిన ఫాదర్ ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న రెండు లక్షలు లేవని గమనించాడు. అదే సమయంలో వంటమనిషి కుమారుడితో వచ్చిన వేముల శంకర్ కనిపించకపోవడంతో ఫాదర్ వంటమనిషిని నిలదీశాడు. తమకేమి తేలియదని వారు సమాధానమిచ్చారు. దీంతో ఫాదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తుండగా.. మరియమ్మ మృతి చెందింది.
ఆమె మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి మృతురాలి బంధువులు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.