హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినపురంలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన(Youngster Attack Girlfriend) యువతి పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలికి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోందని ఆర్ఎంవో రణధీర్ వెల్లడించారు. శుక్రవారం మరోసారి స్కానింగ్ తీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కడుపు భాగంలో ఇంకా రక్తస్రావం అవుతోందని... స్కానింగ్ రిపోర్ట్స్ ఆధారంగా సర్జరీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ రాకుండా మెడిసిన్ ఇస్తున్నామని.. యువతి స్పృహలోనే ఉన్నట్లు తెలిపారు.
2 రోజుల కిందట గాయపడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు బ్లీడింగ్ పెరిగింది. కడుపు, చెస్ట్‌లో పెరిగింది. మొదటి రెండు రోజుల వరకు మినిమమ్గానే ఉండేది. ఈ రోజు సీటీ స్కానింగ్ రిపీట్ చేశాం. సర్జన్లతో మాట్లాడుతున్నాం. సర్జరీ చేయాలా? లేదా అనేది సర్జన్ నిర్ణయాన్ని బట్టి తీసుకుంటాం. బీపీ నార్మల్‌గానే ఉంది. చెస్ట్‌లో బ్లీడింగ్ పెరగడం వల్ల ఆయాసం అనేది కొంచెం ఇబ్బంది పెడుతోంది. మిగతా విషయాలు త్వరలోనే అప్డేట్ చేస్తాం.
-రణధీర్, ఆర్ఎంవో
కొన్ని నెలలుగా ప్రేమాయణం..
బాధితురాలు, నిందితుడు ఒకే మండలం సమీప గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన యువతికి.. సమీప గ్రామానికి చెందిన బసవరాజుతో కొన్ని నెలల కింద పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరు నగరానికి వచ్చి వేర్వేరుగా నివాసముంటున్నారు. బస్వరాజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు అడపాదడపా కలుసుకుంటూ.. ప్రేమలో కొనసాగుతున్నారు.