Rape at Repalle: సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు వచ్చినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఏపీలోని బాపట్ల జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.
బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై.. సామూహిక అత్యాచారం జరిగింది. బాధిత మహిళ భర్తను కొట్టి.. వలస కూలీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు బాధితులు తెలిపారు. అవనిగడ్డలో పనుల కోసం భార్యభర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్‌లో దిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోని బల్లలమీద పడుకున్నారు. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు బల్లపై నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వారికి అడ్డుపడ్డ భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నిందితులను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత దంపతులు నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.