వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామగుండం కార్పొరేషన్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన పులి ప్రణయ అనే గర్భిణీ శనివారం ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం.. నిన్న రాత్రి అనారోగ్యానికి గురైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. వెంటనే ఆక్సిజన్ అందించాల్సి ఉండగా.. అందుబాటులో లేకపోవడంతో బాలింత మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆందోళన చేపట్టారు. వీరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మద్దతుగా నిలిచారు.
ప్రణయకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని నర్సుకు చెప్పాం. వచ్చి చూసి.. పర్లేదు ఏం కాదు అని చెప్పింది. ఇబ్బంది మరింత ఎక్కువ కావడంతో మళ్లీ వెళ్లి చెబితే.. ఆక్సిజన్ తెచ్చి పెట్టే ప్రయత్నం చేసింది. కానీ అది సరిగా లేకపోవడంతో డాక్టర్ను తీసుకొస్తానని వెళ్లింది. 20 నిమిషాల తర్వాత డాక్టర్ వచ్చి చూసేసరికి ప్రణయ చనిపోయింది.-ప్రతాప్, మృతురాలి సోదరుడు
ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోకపోవడం వైద్యుల నిర్లక్ష్యమే అంటూ స్థానిక కాంగ్రెస్ నేత రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ ఆరోపించారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఆరోపణలను వైద్యులు ఖండించారు. చికిత్స జరుగుతున్న సమయంలోనే బాలింత చనిపోయిందని గోదావరిఖని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హిమబిందు పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.