Loan Apps Suicides: 'నువ్వు చచ్చినా సరే.. మా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించాల్సిందే.. లేదంటే నీ ఫొటోలన్నీ మార్ఫ్ చేసి వేరే వ్యక్తితో నీకు వివాహేతర సంబంధం ఉన్నట్లు నీ ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లకు పంపిస్తా'నంటూ మంచిర్యాల జిల్లాలోని ఓ మహిళను వేధించి.. చివరకు ఆమె ఉసురు తీసుకున్నారు దా'రుణా'ల యాప్ నిర్వాహకులు. లోన్ యాప్లో రుణం తీసుకుని గడువు దాటినా చెల్లించకపోవడంతో.. నిర్వాహకులు యథావిధిగా తమ అసలు స్వరూపం బయటపెట్టారు. బాకీ వసూలు చేసుకునేందుకు ఆమెను నిరంతరం వేధించారు. వారి వేధింపులు తాళలేక ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె.. ప్రాణాల నుంచి బయటపడినా వారు కనికరించలేదు. బెదిరింపులు ఎక్కువ కావడంతో ఈ సారి ఏకంగా మృత్యు ఒడికే చేరింది.
రుణ యాప్ల వేధింపులు తట్టుకోలేక మంచిర్యాల జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లా కేంద్రంలోని గోపాల్వాడకు చెందిన బొల్లు కల్యాణి (30).. భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. కరోనా సమయంలో భర్త ఉద్యోగం పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమయంలో లోన్ యాప్ల ద్వారా రుణాలు పొందవచ్చని తెలుసుకున్న గృహిణి.. పలు దఫాలుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి 7 లోన్ యాప్లు ఇన్స్టాల్ చేసుకుని రుణాలు పొందింది. గడువు దాటినా చెల్లించకపోవడంతో.. ఓ యాప్ నిర్వాహకులు ఆమెకు పదేపదే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. సమయం కావాలని అడిగినా వారు కనికరించలేదు.