Woman Suicide: కేవలం తాము కొట్టినందుకే మనో వేదనతో ఆత్మహత్య చేసుకుందని, బయటకు తెలిస్తే గొడవవుతుందని సొంత వదిన శవాన్ని సంచిలో కట్టి తీసుకువెళ్లి ఆమె మరిది సింగూర్ డ్యాంలో పడేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలను ఎస్సై విజయ్‌ప్రకాష్ వెల్లడించారు. మండల పరిధి అమ్రాదికలాన్ గ్రామానికి చెందిన సంఘముని (45)భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి సంఘముని, ఆమె కూతుళ్లు, మరిది మేకల శ్రీనివాస్, మామ బీరయ్య అందరూ కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లుగా వారి మధ్య సొంత భూమి 10 ఎకరాలకు సంబంధించి వివాదాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో గత ఆదివారం(మే 15) రాత్రి మామ, మరిది, అతని భార్య లక్ష్మి కలిసి గొడవ పెట్టుకొని ఆమెను కొట్టారు.
కుటుంబీకుల దాడితో మనస్తాపానికి గురైన సంఘముని.. మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్తున్నానని చెప్పి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న మరిది గ్రామ పెద్దలకు తెలిస్తే కుటుంబసభ్యులకు శిక్ష పడుతుందని ఎవరికీ అనుమానం రాకుండా తన స్నేహితుడు శ్రీహరి సహాయంతో శవాన్ని బావిలో నుంచి వెలికి తీసి ఓ మసాల సంచిలో కట్టాడు. ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం పరిసరాల్లోని సింగూర్ డ్యాం వంతెన పైనుంచి నీటిలో పడేశాడు. ఏమీ తెలియనట్లు గత మంగళవారం(మే 17) అతను ఠాణాకు వచ్చి తన వదిన కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశాడు.
మహిళ అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా కుటుం సభ్యులను విచారించారు. సంఘముని మృతికి కారణం కుటుంబ సభ్యులేనని దర్యాప్తులో తేలింది. ఆమె మరిదిని తమదైన శైలిలో విచారించగా శవాన్ని సింగూర్ డ్యాంలో పడేసినట్లు చెప్పాడు. శనివారం డ్యామ్ దగ్గరికి వెళ్లి శవాన్ని వెలికి తీశారు. నిందితులను విచారిస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్ ప్రకాష్ తెలిపారు.