చదువుకునే రోజుల్లో ఒకరికొకరు పరిచయమయ్యారు. కొద్ది సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకొద్దామంటే ఇంట్లో వారు ఒప్పుకోరేమోనని భయం. అలా అని ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితి. ఏదైనా కానీ తరువాత చూసుకుందాం అనుకున్నారు. ముందైతే పెళ్లి చేసుకుందామని ధైర్యం చేశారు. ఎట్టకేలకు పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.
అలా ఇంట్లో వాళ్లకు తెలియకుండా వివాహం చేసుకుని రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రాంతంలో అపార్ట్‌మెంట్లో ప్లాట్ తీసుకుని కాపురం పెట్టారు. చూస్తుండగానే పది నెలలు గడిచాయి. ఇంతలో ఆ యువకుడి చెల్లికి పెళ్లి కుదిరింది. పెళ్లి పనుల కోసం అతను తన ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లిన రెండోరోజే భర్తకు వీడియో కాల్ చేసి ఇంటికి రమ్మని కోరింది ఆ మహిళ. వివాహం జరిగిన వెంటనే వచ్చేస్తానని చెప్పినా వినకుండా.. వెంటనే రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. భయపడిన అతడు.. పక్కింటి వారిని అప్రమత్తం చేసేలోగానే అన్నంత పని చేసింది. ఉరి వేసుకుని బలవన్మరణాని(Woman suicide)కి పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
రాజేంద్రనగర్ ఎస్సై శ్వేత వివరాల మేరకు....రాజమహేంద్రవరానికి చెందిన నాగదేవి(25), దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండే సాయిశివ హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదివారు. అప్పుడే ప్రేమించుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాయిశివ 10 నెలల కిందట ఇంట్లో చెప్పకుండా నాగదేవిని వివాహం చేసుకున్నాడు. రాజేంద్రనగర్ పరిధి చైతన్యవిలాస్ కాలనీలోని అపార్ట్‌మెంట్లో కాపురం పెట్టాడు. బెంగళూరు నుంచి వచ్చి వెళ్తుండేవాడు. నాగదేవి బ్యుటీషియన్‌గా పనిచేస్తోంది.
శివ సోదరి వివాహం ఉండటంతో దిల్‌సుఖ్‌నగర్ వచ్చాడు. సోదరి పెళ్లి తరువాత తమ పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులతో చెబుతానని భార్యతో చెప్పాడు. మంగళవారం రాత్రి నాగదేవి భర్తకు ఫోన్‌చేసి వెంటనే ఇంటికి రావాలని కోరింది. పెళ్లి తరువాత వస్తానని చెప్పడంతో వెంటనే వీడియో కాల్‌చేసి ఇంటికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఫోన్ పెట్టేసి అపార్ట్‌మెంట్లోని పక్క ఫ్లాట్ వారిని అప్రమత్తం చేశాడు. వారు వెళ్లేలోపే నాగదేవి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య(Woman suicide)కు పాల్పడింది. ఇరుగుపొరుగు తలుపులు బద్దలు కొట్టి చూసేసరికే మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.