తెలంగాణ

telangana

ETV Bharat / crime

రివాల్వర్​ గురిపెట్టి వివాహితపై అత్యాచారం.. మారేడుపల్లి సీఐ అరాచకం - ఇన్‌స్పెక్టర్‌పై కిడ్నాప్ కేసు

Woman accuses Inspector of rape : తన భర్తపై దాడి చేసి.. తనను అపహరించి ఇన్​స్పెక్టర్​ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫిర్యాదు చేసింది. స్పందించిన వనస్థలిపురం పోలీసులు ఇన్‌స్పెక్టర్‌పై  కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. అత్యాచారం, ఆయుధ చట్టం కింద నాగేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సీఐ నాగేశ్వరరావు
సీఐ నాగేశ్వరరావు

By

Published : Jul 9, 2022, 12:15 PM IST

Updated : Jul 10, 2022, 4:24 AM IST

Woman accuses Inspector of rape : శాంతిభద్రతలు.. ప్రజల మానప్రాణాలను కాపాడాల్సిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఒక వివాహితపై కన్నేశాడు. భర్త లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. కణతపై తుపాకి గురిపెట్టి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఆమె భర్త రావడంతో.. దంపతులిద్దరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్తుండగా, వారు తప్పించుకుని.. వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన వివరాలను బాధితులు, పోలీసులు శనివారం వెల్లడించారు. నిందితుడు మారేడ్‌పల్లి పీఎస్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే కె.నాగేశ్వరరావు. అత్యాచారం, అపహరణ, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేశామని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. నిందితుడిని పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సస్పెండ్‌ చేశారు. పరారీలో ఉన్న అతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

వ్యవసాయ క్షేత్రంలో కూలీగా నియామకం
నిందితుడు నాగేశ్వరరావుకు హైదరాబాద్‌ శివారులో వ్యవసాయ క్షేత్రం ఉంది. నాలుగేళ్ల కిందట బాధిత మహిళ భర్తను ఒక కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు అతడిని విచారించాడు. బెయిల్‌పై బయటకు వచ్చాక అతడిని తన వ్యవసాయ క్షేత్రంలో నియమించుకున్నాడు. బాధిత దంపతులు వేరేచోట నివసించేవారు. ఇన్‌స్పెక్టర్‌ ఒకరోజు బాధిత మహిళను ఫామ్‌హౌస్‌కు వెళ్దామని పిలిచాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పగా.. వెంటనే అతడు నాగేశ్వరరావుకు ఫోన్‌ చేశాడు. ఇదంతా మీ భార్యకు చెబుతానని హెచ్చరించడంతో.. 'తప్పయ్యింది.. క్షమించు' అంటూ నాగేశ్వరరావు అతడిని వేడుకున్నాడు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది.

గంజాయి కేసులో ఇరికిస్తానని..
తనను బెదిరించడాన్ని జీర్ణించుకోలేకపోయిన నాగేశ్వరరావు బాధిత మహిళ భర్తను ఒకరోజు సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి రప్పించాడు. అతడి జేబులు, చేతుల్లో గంజాయి సంచులు ఉంచి వీడియోలు, ఫొటోలు తీయించాడు. వాటి ఆధారంగా కేసు నమోదు చేయిస్తానని బాధితుడిని హెచ్చరించి పంపించాడు. గత ఏడాది ఫిబ్రవరి వరకు ఫామ్‌హౌస్‌లో పనిచేసిన అతడు తర్వాత పని మానేశాడు. వనస్థలిపురంలో భార్యా పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. నాగేశ్వరరావు వారి కదలికలపై నిఘా ఉంచాడు.

భర్త లేని సమయంలో..
తన కోరిక తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్న ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు జులై 6న బాధితురాలికి వాట్సప్‌ కాల్‌ చేశాడు. 'నీ మొగుడు ఊళ్లో లేడుగా... నేను వస్తున్నా' అంటూ మాట్లాడాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. ఆ సమయంలో సొంతూరులో ఉన్న అతడు.. తాను వస్తున్నానని ఆమెకు బదులిచ్చాడు. అతడు రాడనుకున్న నాగేశ్వరరావు గురువారం రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లాడు. తలుపు వేసి ఆమెను కొట్టాడు. రివాల్వర్‌ కణతకు గురిపెట్టి అత్యాచారం చేశాడు. అర్ధరాత్రి దాటేవరకు ఆమె ఇంట్లోనే ఉన్నాడు. ఈలోపు ఆమె భర్త తిరిగివచ్చాడు. ఇంట్లో ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావును చూసి ఆగ్రహించి.. కర్రతో కొట్టాడు. వెంటనే నాగేశ్వరరావు రివాల్వర్‌తో భార్యాభర్తలను చంపేస్తానంటూ బెదిరించాడు. ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకుని తన ఫామ్‌హౌస్‌ వైపు బయలుదేరగా.. ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై టైరు పేలింది. కారు ఆగిపోవడంతో దంపతులిద్దరూ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. విషయం బయటకు వస్తుందని గ్రహించిన ఇన్‌స్పెక్టర్‌.. తన కారుకు ప్రమాదం జరిగిందంటూ ఇబ్రహీంపట్నం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. నాగేశ్వరరావు గతంలో ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా, 3నెలల కిందటి వరకు బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు.

Last Updated : Jul 10, 2022, 4:24 AM IST

ABOUT THE AUTHOR

...view details