Wife Killed Husband: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో దారుణం చోటుచేసుకుంది. భార్యే భర్తను చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాచర్ల రాజయ్య, రాజక్క దంపతులు. కల్లు అమ్ముకుంటూ జీవనంసాగించే వారి మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. కాగా.. కొన్ని రోజులుగా ఇద్దరు వేర్వేరుగా నివాసముంటున్నారు. వీళ్లకు వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా.. ఒక కూతురు చనిపోయింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా.. అందులో ఒకరు భర్తను వదిలేసి తల్లితోనే ఉంటోంది.
కుటుంబ కలహాలతో విసిగిపోయిన రాజక్క.. ఎలాగైనా రాజయ్యను హతమార్చాలని నిశ్చయించుకుంది. ఈరోజు(మార్చి 27) వేకువజామున తాను ఉంటున్న ఇంటి ముందు నుంచి వెళ్తున్న రాజయ్యను గమనించింది. మాట్లాడదామని ఇంటికి పిలిచింది. నమ్మిన రాజయ్య ఆగటంతో.. ఒక్కసారిగా కంట్లో కారం కొట్టింది. తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలోనే రోకలిబండతో.. తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ రాజయ్య అక్కడే ఉన్న మురుగు కాలువలో పడిపోయి ప్రాణాలు విడిచాడు.