Wife Attempted to murder husband: పుష్ప సినిమాలో బుల్లి తెర వ్యాఖ్యాత అనసూయ పాత్ర దాక్షాయణి ఊరమాస్. ఎంత మాస్ అంటే ఆమెను చూస్తే భర్త మంగళం శీను కూడా భయపడేంత. కానీ తమ్ముడంటే ఆమెకు పంచ ప్రాణాలు. తన తమ్ముడిని పుష్ప చంపేశాడని తెలిశాక.. పగతో రగిలిపోతుంది. తమ్ముడిని చంపిన వాళ్లను మంగళం శీను చంపుతాడేమోనని ఎదురుచూసింది. ఆ ఆశ తీరకపోయే సరికి.. భర్తపై కోపం పెంచుకుంది. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి బ్లేడు తీసుకుని మంగళం శీను గొంతుకోసింది. అక్కడ మరి దాక్షాయణి.. తమ్ముడి కోసం భర్త గొంతు కోస్తే.. ఇక్కడ ఓ మహిళ కూడా అలాగే పట్ట పగలు భర్త గొంతు కోసింది. అది కూడా పెళ్లయిన నెల రోజుల్లోపే..
పెళ్లి ఇష్టం లేదని.. కాబోయే భర్త గొంతు కోసిన పుష్ప ఘటన మరువక ముందే... మరో దారుణం వెలుగుచూసింది. పెళ్లైన నెలకే ఓ మహిళ బ్లేడుతో భర్త మెడ కోసింది. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో ఈ దారుణం వెలుగుచూసింది. రాజ- అర్చనలకు పెళ్లయి నెల రోజులే అయింది. వివాహం జరిగినప్పటి నుంచి బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఆదివారం రాత్రి అర్చన పిచ్చిపట్టినట్లు ప్రవర్తించిందని చెప్పారు. అర్ధరాత్రి సమయంలో తాళిబొట్టు, గాజులు తీసేసినట్లు వెల్లడించారు. తెల్లవారుజామున మూడు గంటలకు ఒక్కసారిగా భర్త మెడ కోసిందని పేర్కొన్నారు.
గమనించిన కుటుంబీకులు వెంటనే రాజును వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాజు బోర్లా పడుకొని ఉండటంతో ప్రమాదం తప్పిందని కుటుంబసభ్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతోనే అర్చన.. రాజుపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.