wife killed husband with lover: పెద్దల బలవంతంతో ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ యువతి.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. ఒకసారి అన్నంలో విషం కలిపి చేసిన హత్యాయత్నం విఫలం కాగా.. రెండోసారి గొంతు నులిమి చంపేసింది. ఛాతీలో నొప్పితో చనిపోయాడని నాటక మాడింది. పోలీసుల దర్యాప్తులో హత్య విషయం వెల్లడవడంతో.. జైలు పాలైంది. పెళ్లయిన 36 రోజుల్లోనే ఇవన్నీ జరగడం గమనార్హం.
ప్రియుడితో కలిసి ప్లాన్... సిద్దిపేట జిల్లాలో గత నెల 28న జరిగిన ఈ హత్య కేసు వివరాలను పట్టణ టూటౌన్ సీఐ వి.రవికుమార్ ఆదివారం వెల్లడించారు. దుబ్బాక మండలం చిన్ననిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల (19)తో గత మార్చి 23న పెళ్లయింది. గుడికందులకే చెందిన శివకుమార్ (20), శ్యామల మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల ఒత్తిడితో చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. ప్రియుడు శివతో కలిసి హత్యకు ప్రణాళిక వేసింది.
ఏకాంతంగా గడుపుదామంటూ...గత ఏప్రిల్ 19న ఆహారంలో ఎలుకల మందు కలిపింది. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని భర్త ఇంటికి వచ్చాడు. ఆహారంలో తేడా అని భావించాడు. ఆలయంలో మొక్కు ఉందంటూ ఏప్రిల్ 28న శ్యామల భర్తను తీసుకొని ద్విచక్ర వాహనంపై వెళ్లింది. అనంతసాగర్ శివారులో ఏకాంతంగా గడుపుదామంటూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ మాటు వేసి ఉన్న శివ, అతడి స్నేహితులు రాకేశ్, రంజిత్, మేనబావ సాయికృష్ణ, వరసకు సోదరుడు భార్గవ్ కలిసి కారును ద్విచక్ర వాహనానికి అడ్డుగా పెట్టారు. నలుగురి సహకారంతో చంద్రశేఖర్‌ను అదిమిపట్టి శ్యామల, శివ కలిసి రుమాలుతో గొంతు నులిమి చంపేశారు.
విచారణతో వెలుగులోకి.. ఛాతీలో నొప్పితో చనిపోయాడని శ్యామల బంధువులకు తెలియజేసింది. చంద్రశేఖర్ తల్లి మనెవ్వ, కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆరుగురు నిందితులను ఆదివారం సిద్దిపేటలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. నేరానికి పాల్పడిన వారంతా 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
ప్రియుడితో కలిసి భర్త హత్య ఇవీ చదవండి: