ఏపీ ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే... కడతేర్చిన ఘటన పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తూర్పుకొప్పెరపాడుకు చెందిన కుంచాల రవి (35)కి అదే గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మితో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు పిల్లలు. మృతుడు రవి బేల్దారి పని చేస్తూ ఉంటాడు. మద్యానికి బానిసైన అతను భార్యపై అనుమానంతో రోజు మద్యం సేవించి ఆమెతో గొడవపడేవాడు. ఎప్పటిలాగే మంగళవారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్తతో.. రాజ్యలక్ష్మి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శీతలపానీయంలో ఎలుకల మందు కలిపి తాగించింది. అది సేవించిన రవి మృతి చెందాడు.