Wife Attack With Blade in AP: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, లక్ష్మీదేవి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్యపై అనుమానంతో గత నెల 25న బ్రహ్మయ్య.. ఆమె గొంతు కోశాడు. వెంటనే స్పందించిన బంధువులు లక్ష్మీదేవిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది. కానీ ఆరోజు నుంచి బ్రహ్మయ్య తప్పించుకొని తిరుగుతున్నాడు.
ఈ క్రమంలోనే లక్ష్మీదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇందులో భాగంగానే ఆమె కొబ్బరి నీళ్ల కోసమని ఆసుపత్రి బయటకు వచ్చింది. ఆసుపత్రి ఆవరణలో సదరు బాధిత మహిళకు.. బ్రహ్మయ్య కనిపించాడు. తన గొంతు కోసిన తర్వాత నుంచి కనిపించని భర్త.. ఆకస్మాత్తుగా కనిపించటంతో ఆమెకు అనుమానం కలిగింది. అతను ముసుగు ధరించి ఉండటం.. చేతిలో బ్లేడు ఉండటంతో మళ్లీ గొంతు కోయటానికి వచ్చాడనే అనుమానం లక్ష్మీదేవికి కలిగింది. వెంటనే బ్రహ్మయ్య వద్దకు వెళ్లి అతని చేతిలో ఉన్న బ్లేడునే తీసుకుని.. అతడి గొంతునే కోసేసింది. ప్రసుత్తం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.