మత్తు.. మనిషిని చిత్తు చేస్తుంది. ఒక్కసారి ఆ మత్తుకు అలవాటుపడితే ఇక వదలడం కష్టం(Whitener Addicts in Telangana) అంటారు బాధితులు. అందుకే వాటిని నిషేధించాలని.. అరికట్టాలని చూసినా.. దానికి మరో ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. డ్రగ్స్ పోతే గంజాయి, గంజాయిని అడ్డుకుంటుంటే వైట్నర్(Whitener Addicts in Telangana). గంజాయి వాడకంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే వ్యసనపరులు మత్తు కోసం వైట్నర్కు అలవాటుపడుతున్నారు. ఆ మత్తులో హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి కేసులు రాష్ట్రంలో వెలుగుచూశాయి.
గంజాయి రవాణాకు అడ్డుకట్ట
రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గంజాయి క్రయవిక్రయాలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు గట్టి నిఘా పెట్టారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేస్తూ గంజాయి ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు. పోలీసుల దాడుల్లో భారీగా సరకు పట్టుబడుతోంది. సరఫరాదారులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. తరచూ గంజాయి విక్రయిస్తూ పట్టుబడే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాయచూర్‌కి సరఫరా అవుతుండటంతో విజయవాడ జాతీయరహదారిపై ముమ్మరంగా తనిఖీలు చేస్తుండటంతో రాజధాని పరిసర ప్రాంతాల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో గుట్కా విక్రయాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో రోజూ పదుల సంఖ్యలో గుట్కా కేసులు నమోదవుతున్నాయి.
మత్తు కోసం వైట్నర్
గంజాయి, గుట్కా విక్రయాలు నిలిచిపోవవడంతో... వాటికి బానిసైన వాళ్లు ఇతర మత్తు పదార్థాలను ఎంచుకుంటున్నారు. వైట్నర్ విరివిగా దొరుకుతుండటంతో కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్, చార్మినార్, బహదూర్‌పుర, కోఠి, ఉప్పల్, మైలార్దేవ్ పల్లి, రాజేంద్రనగర్, లంగర్ హౌస్, ఆసిఫ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, తార్నాక, కుషాయిగూడ ప్రాంతాల్లో వైట్నర్(Whitener Addicts in Telangana)ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. యాచకులు, చిత్తు కాగితాలు సేకరించే వాళ్లు, వీధులపై పడుకునే వాళ్లు ఎక్కువగా వైట్నర్ను వినియోగిస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాలు, పట్టాల పక్కన ఉంటూ వైట్నర్ సేవిస్తున్నారు. వైట్నర్ మత్తులో రహదారుల పక్కన ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు.