మత్తు కోసం వైట్‌నర్(Whitener addiction in Hyderabad) రసాయనాన్ని పీల్చుతున్న కొందరు ఆ మత్తులో దారుణాలకు తెగబడుతున్నారు. రాత్రుళ్లు సంచరించేవారిపై దాడులు చేస్తున్నారు. చంపేందుకూ వెనుకాడడంలేదు. 4 రోజుల్లో ముగ్గురు దారుణంగా హతమయ్యారు... ఇద్దరిని ఒకే వ్యక్తి గంటల వ్యవధిలో చంపేశాడు.
నిషేధమున్నా విచ్చలవిడిగా విక్రయాలు..
అక్షరాల్లో తప్పులు దిద్దేందుకు, ఫైళ్లల్లో మార్పులు చేర్పులు చేసేందుకు వైట్‌నర్‌ను వినియోగిస్తారు. దీని తయారీలో రసాయనం వాడతారు. దాన్ని పీల్చితే మత్తుగా(Whitener addiction in Hyderabad) ఉంటోందని గ్రహించిన కొందరు యువకులు, విద్యార్థులు వీటిని యథేచ్ఛగా కొంటున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్ధం లేని ప్రాంతాల్లో ఉంటున్న యువకులు, యాచకులు, కొందరు మహిళలు మద్యం తాగేందుకు డబ్బులేక వైట్‌నర్‌ను ఉపయోగిస్తున్నారు. రోజుకు హైదరాబాద్‌లోనే 3000 లీటర్ల విక్రయాలు కొనసాగుతున్నాయని అనధికారిక అంచనా. రాత్రివేళల్లో అల్లరిచిల్లరగా తిరిగే వ్యక్తులు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలుసుకున్న పోలీస్ శాఖ.. ద్రవరూపంలో ఉన్న వైట్‌నర్‌పై కొద్దినెలల క్రితమే నిషేధం విధించింది. అయినా స్టేషనరీ, కిరాణా దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు, కొన్ని మందుల దుకాణాల్లో వీటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.