Girl Suicide in Mancherial: తనతో దిగిన చిత్రాలను ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
Girl Suicide in Mancherial : ప్రాణం తీసిన వాట్సాప్ స్టేటస్ - తాండూరులో బాలిక మృతి
Girl Suicide in Mancherial : 17 ఏళ్ల బాలికతో దిగిన ఫొటోలను ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. అది చూసిన ఆమె తల్లిదండ్రులు ఫొటోలు తొలగించాలని అతడికి విన్నవించారు. అయినా ఆ యువకుడు వినిపించుకోలేదు. ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడకు చెందిన బాలిక (17) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండగ నిమిత్తం స్వగ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటోంది. బుధవారం స్థానిక యువకుడు ఎ.అజయ్ యువతితో తీసుకున్న ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు చిత్రాలను తీసేయాలని విన్నవించినా.. ఆ యువకుడు వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం అర్ధరాత్రి ఇంట్లోనే పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.