DCP Joel Davis: హైదరాబాద్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు ప్రసాద్‌ను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ప్రసాద్ భార్య సర్పంచి పదవి పోవడంతో పాటు.. పెండింగ్ లో ఉన్న రూ.20లక్షలు మంజూరు కాకపోవడానికి ఎమ్మెల్యేనే కారణమని ప్రసాద్ భావించాడని తెలిపారు. అందుకే ఆయనపై కక్ష్య పెంచుకొని హత్యకు కుట్ర పన్నాడని జోయల్ డేవిస్ వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రసాద్ భార్య సర్పంచ్ లావణ్య అక్రమాలకు పాల్పడినట్లు మక్లూర్ ఎంపీఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారని జోయల్ డేవిస్ తెలిపారు. ఎంపీఓ పైనా ప్రసాద్ దాడి చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పారు. ఎమ్మెల్యేను హత్య చేయాలని కుట్ర పన్నిన ప్రసాద్ నాంపల్లిలో ఎయిర్ పిస్టల్.. మహారాష్ట్రలోని నాందేడ్‌లో కత్తిని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
తెలిసిన వ్యక్తుల ద్వారా గత నెల జులై 15న బిహార్‌కు చెందిన మున్నా వద్ద దేశవాళీ తుపాకీ కొనుగోలు చేసినప్పటికీ.. అందులో బుల్లెట్లు లేకపోవడంతో వాటికోసం ప్రసాద్ ప్రయత్నించి విఫలమయ్యాడని జోయల్ డేవిస్ తెలిపారు. ఎయిల్ పిస్టల్‌తోనే ఎమ్మెల్యేని హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 1న రాత్రి 8.30 గంటల సమయంలో బంజరాహిల్స్ వెళ్లిన ప్రసాద్ నేరుగా 3వ అంతస్తులోకి వెళ్లి జీవన్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు. ఇది గమనించి ఒక్కసారిగా ఎమ్మెల్యే కేకలు వేయడంతో ప్రసాద్ అక్కడినుంచి పారిపోయాడని చెప్పారు.