తెలంగాణ

telangana

ETV Bharat / crime

SUICIDE: నదిలో దూకి వార్టు వాలంటీర్‌ ఆత్మహత్య... సూసైడ్​ నోట్​లో ఏముందంటే? - గుంటూరు జిల్లా తాజా సమాచారం

సచివాలయ సిబ్బంది ఒత్తిడి తట్టుకోలేక ఓ వార్డు వాలంటీర్ ఆత్మహత్య(ward volunteer suicide) చేసుకున్నాడు. ఆ మేరకు సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లాలో జరిగింది.

ward volunteer  suicide
ward volunteer suicide

By

Published : Nov 4, 2021, 10:16 AM IST

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న 15వ సచివాలయ వార్డు వాలంటీరు బుధవారం కృష్ణానదిలో శవంగా తేలాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మహానాడుకు చెందిన బొరిగర్ల వెంకట రవికుమార్‌ (21) బీటెక్‌ పూర్తిచేసి 15వ సచివాలయ పరిధిలో వాలంటీరుగా పనిచేస్తున్నారు. అక్టోబరు 31 నుంచి కనిపించకుండా పోయారు. అదేరోజు సాయంత్రం అతడి తండ్రి రాజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

బుధవారం మధ్యాహ్నం పశువుల కాపర్లు కృష్ణానదిలో మృతదేహాన్ని చూసి మరో వాలంటీరుకు తెలిపారు. అతను మృతదేహాన్ని పరిశీలించి రవికుమార్‌గా అనుమానించి రాజయ్యకు తెలిపారు. ఆయన తన కొడుకుగా నిర్ధారించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతుడి జేబులను తనిఖీ చేయగా పాలిథిన్‌ కవర్లో ఉంచిన ఓ లేఖ లభ్యమైంది. అందులో..

‘నా చావుకు కారణం ఈ వాలంటీరు వ్యవస్థ. బాగానే పనిచేసినా తీవ్రమైన ఒత్తిడికి గురిచేసేవారు. సచివాలయ సిబ్బందికి పనిలో సహాయం చేసినా ఏమాత్రం కృతజ్ఞత చూపరు. ఒత్తిడి వల్ల మానసికంగా కృంగిపోయాను. మొన్నటివరకు అడ్మిన్‌ పదేపదే రిజైన్‌ చేయాలని ఇబ్బంది పెట్టేవారు’ అని రాసి ఉంది.

ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేఖ చివరలో వాలంటీరు సంతకం లేదని, అందులోని చేతిరాత అతనిదో కాదో పరిశీలించాల్సి ఉందని సీఐ శేషగిరిరావు తెలిపారు. లేఖను ఫోరెన్సిక్‌ విభాగానికి పంపుతున్నట్లు చెప్పారు. మృతుడి తండ్రి రాజయ్య వాంగ్మూలం తీసుకొని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి ఆసుపత్రికి వెళ్లి వాలంటీరు మృతదేహాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details