Warangal Murders: వరంగల్ దారుణ హత్యల కేసు.. ఆరుగురి అరెస్ట్ - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
11:35 September 02
ఆ మూడు హత్యలకు కారణమేంటంటే?
వరంగల్ ఎల్బీనగర్‌లో ఆస్తి తగాదాలతో సొంత అన్న కుటుంబాన్నే అతిదారుణంగా హతమార్చిన నిందితుడిని అతడికి సహకరించిన వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత కాలంగా ఉన్న ఆస్తి గొడవలే హత్యలకు కారణమని సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు.హత్యలు చేసేందుకు వినియోగించిన వేట కత్తులతో పాటు, చెట్లను నరికే బ్యాటరీ కోత మిషన్, రెండు ఆటోలు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పక్కా పథకం ప్రకారమే నిందితులు దాడికి ఒడిగట్టారన్న సీపీ... మృతుడి ఇద్దరు కుమారులపైనా హత్యయత్నం చేసినట్లు తెలిపారు. నిందితులు తమను గుర్తు పట్టకుండా ఉండేందుకుగాను... కారం పొడిని ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దారుణానికి పాల్పడిన షఫీపై గతంలోనూ ఓ కేసు ఉందని సీపీ తెలిపారు.
హత్యలు చేసేందుకు నిందితుడు షఫీ... తమ వద్దే పనిచేసే వారితో పాటు తన మిత్రులైన వారి సహకారం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ హత్యా పథకంలో భాగంగా నిందితులు హత్యలు చేసేందుకుగాను హైదరాబాద్‌లో ఐదు వేటకత్తులతో పాటు వరంగల్ నగరంలో బ్యాటరీతో పనిచేసే చెట్లను నరికే మిషన్ కొనుగోలు చేసినట్లు సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.