పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తోటి ఉద్యోగి వేధింపులు తాళలేక ఓ యువతి తనువు చాలించింది. పెద్దపెల్లి జిల్లా నిమ్మనపల్లె గ్రామానికి చెందిన వీఆర్ఏ మహంకాళి దివ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తోంది. అదే మండలంలోని కొత్తపల్లి గ్రామ వీఆర్ఏ పేర్క వెంకటేశ్ ప్రేమించాలంటూ తరచూ వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వేధింపులు భరించలేక వీఆర్ఏ ఆత్మహత్య - పెద్దపల్లిలో వీఆర్ఏ సూసైడ్
పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేసే మహంకాళి దివ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి ఉద్యోగి వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది.
![వేధింపులు భరించలేక వీఆర్ఏ ఆత్మహత్య VRA suicide in peddapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11537011-264-11537011-1619369017843.jpg)
మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు
తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న దివ్యను తరచూ కలిసేందుకు వెంకటేశ్ వచ్చేవాడని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ఆమె తన బంధువులకు చెప్పగా... వారు అతన్ని గట్టిగా మందలించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో తనను ప్రేమించమని శనివారం అతను దివ్యతో గొడవ పడగా... చిత్రహింసలు భరించలేని యువతి జిల్లా కేంద్రంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలు తమ్ముడు దిలీప్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు.