మనీలాండరింగ్‌కు పాల్పడి బ్యాంకులకు సుమారు 3,316 కోట్ల రూపాయల నష్టం కలిగించారన్న అభియోగంపై టెలికాం పరికరాల తయారీ సంస్థ వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీ వి.హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. రుణాల పేరుతో వివిధ బ్యాంకులను మోసం చేశారని 2018లో వీఎంసీ సిస్టిమ్స్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
రూ.3,316 కోట్ల మోసం చేశారని వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ అరెస్ట్ - telangana varthalu
15:42 August 05
బ్యాంకులను మోసం చేశారని హిమబిందు అరెస్టు
వివిధ బ్యాంకులకు వీఎంసీ సిస్టమ్స్ సుమారు 3,316 కోట్ల రూపాయల రుణాలు బకాయిపడినట్లు ఈడీ పేర్కొంది. రుణాల సొమ్మును వివిధ కంపెనీల పేరిట బదిలీ చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో తేలిందని ఈడీ తెలిపింది. బీఎస్ఎన్ఎల్ టెండర్లతో ఎలాంటి సంబంధం లేని పీఐఎస్ లిమిటెడ్‌కు వీఎంసీ సిస్టమ్స్ 3 శాతం కమీషన్ ఇచ్చినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరించింది.
బోగస్ సంస్థల పేరిట సుమారు 692 కోట్ల రూపాయల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్లు తెరిచినట్లు ఈడీ తెలిపింది. బ్యాంకులను మోసం చేసేందుకు తన సోదరుడు వి.సతీశ్‌తో కలిసి హిమబిందు బోగస్ రశీదులు, పత్రాలు, దస్త్రాలు సృష్టించినట్లు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. కొంత సొమ్మును తన కుటుంబ సభ్యులకు చెందిన విదేశీ కంపెనీలకు కూడా మళ్లించినట్లు దర్యాప్తు సంస్థ వివరించింది.
గత నెల 20న హిమబిందు, సతీశ్, వి.మాధవి ఇళ్లల్లో సోదాలు జరిపి సుమారు 40 హార్డ్ డిస్కుల్లో డిజిటల్ డేటా, ఆరు చరవాణులు, రెండు ల్యాప్ టాప్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. సమన్లు ఇచ్చినప్పటికీ హిమబిందు స్పందించడం లేదని.. లావాదేవీలకు సంబంధించిన వివరాలు, దస్త్రాలు సమర్పించకుండా విచారణకు సహకరించక పోవడంతో.. అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. హిమబిందుకు నాంపల్లి కోర్టు ఈనెల 18 వరకు రిమాండ్ విధించింది.
ఇదీ చదవండి: Devineni Uma: రాజమహేంద్రవరం జైలు నుంచి దేవినేని ఉమ విడుదల