Vizianagaram theft case: అతడు చెడు వ్యసనాలతో దొంగగా మారాడు. 60 దొంగతనాలకు పాల్పడి, జైలు శిక్ష సైతం అనుభవించాడు. అయినప్పటికీ తన ప్రవర్తనలో మార్పులేదు. ఇళ్ల దోపిడీల్లో నైపుణ్యం సాధించిన ఆ నిందితుడు తిరిగి పలు జిల్లాల్లో 27 దోపిడీలకు పాల్పడ్డాడు. విజనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగ మామిడి తిరుపతిరావు(34) విజయనగరం పోలీసులకు పట్టుబడ్డాడు.
నిందితుడికి సంబంధించిన వివరాలను.. విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక జిల్లా వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం గంగాడకు చెందిన మామిడి తిరుపతిరావు.. విశాఖపట్నం శ్రీహరిపురం చేపల మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. చెడు వ్యసనాలకు లోనై, డబ్బు కోసం ఇళ్లల్లో దోపిడీ చేయటం వృత్తిగా ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తిరుపతిరావు 60కేసుల్లో జైలు శిక్ష సైతం అనుభవించినట్లు ఎస్పీ దీపిక వెల్లడించారు.