bsp leader missing case update: వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సత్యమూర్తి అదృశ్యం కేసులో పురోగతి లభించింది. శనివారం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి అదృశ్యమైన సత్యమూర్తి.. ముంబయిలో ఉన్నట్లు తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. ముంబయి పోలీసుల సాయంతో సత్యమూర్తిని తీసుకురానున్నట్లు వివరించారు. అతని ఇంట్లో వదిలివెళ్లిన సెల్ ఫోన్, పెన్‌డ్రైవ్‌లను వారి కుటుంబసభ్యుల అనుమతితో స్వాధీనం చేసుకుంటామన్న ఆయన.. వాటిని పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఈ సందర్భంగా సత్యమూర్తి ఇంటికి తిరిగి వచ్చి.. కేసు దర్యాప్తులో పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతున్నామని స్పష్టం చేశారు.
అసలేమైందంటే..
వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సత్యమూర్తి భార్య అన్నపూర్ణ మూడు నెలల కిందట అదృశ్యమయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి సత్యమూర్తి అదృశ్యమయ్యారు. తాండూర్లోని తన నివాసానికి తాళం వేసి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు వీళ్లు కూడా కనిపించకుండా పోవటం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు.. కూతుళ్లతో కలిసి సత్యం రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉద్వేగంతో వాళ్లు మాట్లాడిన మాటలు.. ఆందోళన కలిగిస్తున్నాయి.