కుటుంబంతో సహా బీఎస్పీ నేత అదృశ్యం.. సెల్ఫీ వీడియో వైరల్.. - Vikarabad BSP district president Satyam family missing
11:26 June 25
కుటుంబంతో సహా బీఎస్పీ నేత అదృశ్యం.. సెల్ఫీ వీడియో వైరల్..
Selfie video viral: వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సత్యం తన ఇద్దరు కూతుళ్లతో పాటు అదృశ్యమయ్యారు. ఇవాళ ఉదయం నుంచి కుమార్తెలతో సహా సత్యం కనిపించట్లేదు. తాండూర్లోని తన నివాసానికి తాళం వేసి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. మూడు నెలల కిందట తన భార్య అన్నపూర్ణ అదృశ్యం కాగా.. ఇప్పుడు వీళ్లు కూడా కనిపించకుండా పోవటం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు.. కూతుళ్లతో కలిసి సత్యం రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉద్వేగంతో వాళ్లు మాట్లాడిన మాటలు.. ఆందోళన కలిగిస్తున్నాయి.
మూడు నెలల కిందట అదృశ్యమైన తన భార్య ఆచూకీని ఇప్పటికీ తెలుసుకోలేదని సత్యంతో పాటు కూతుళ్లు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు బతికున్నామంటే.. తమ తల్లి వస్తుందన్న నమ్మకంతోనేని పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు దృష్టి సారించి తమ తల్లి ఆచూకీ కనిపెట్టాలని వేడుకున్నారు. తన భార్య అదృశ్యం కేసు వెనక పెద్దవాళ్ల హస్తం ఉందని.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని సత్యం తెలిపారు. వాటన్నింటిని పోలీసులకు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ చెప్పకపోతే తన ఇద్దరు కూతుళ్లతో పాటు తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తమ మృతదేహాలకు సంబంధించిన లొకేషన్‌ను సోషల్ మీడియాలో తెలియజేేస్తానని తెలిపారు.
ఇంటికి తాళం వేసి ఉండటం.. వాళ్ల సెల్ఫీ వీడియో వైరల్ కావటం.. అందులో రెండు రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే చనిపోతానని చెప్పటం.. ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వాళ్లు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.