ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కలకలం రేపిన తస్లీం ఫాతిమా అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. చిట్టినగర్‌లో ఉంటున్న నజీర్ అహ్మద్ కుమార్తె ఫాతిమా... మానసిక సమస్యలతో బాధ పడుతుండేది. తెలిసినవారు చెప్పడంతో.. కుమార్తెకు మానసిక ఇబ్బందుల్ని తొలగించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భూతవైద్యుడు మహ్మద్ వాసీఫ్ను పిలిపించాడు. వాసిఫ్ తన స్నేహితుడితో కలిసి వచ్చాడు. వారం రోజులు విజయవాడలోనే ఉండి.. ప్రేమ పేరుతో ఫాతిమాను లోబర్చుకున్నాడు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లిపోయాడు. ఫాతిమాతో ఫోన్లో మాట్లాడుతూనే, ఉత్తర్‌ప్రదేశ్ వస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
భార్యతో గొడవలొస్తున్నాయని ..
గత నెల 9న ఫాతిమా దిల్లీ వెళ్లేందుకు రైలు టికెట్, విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు ప్రయాణించడానికి వాహనాన్నీ వాసిఫ్ ఏర్పాటు చేశాడు. దిల్లీ చేరుకున్న ఫాతిమాను స్నేహితుడు తయ్యబ్‌తో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని షెహరాన్‌పూర్ తీసుకెళ్లిన వాసీఫ్.. 5 రోజులు ఒక ఇంట్లో ఉంచాడు. ఈ విషయం తెలిసిన భార్య.. వాసీఫ్ను నిలదీసింది. అదే సమయంలో ఇంటి యజమానికీ అనుమానం రావటంతో.. ఫాతిమాను మరో చోటుకి మార్చాడు. రోజులు గడిచేకొద్దీ పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్న ఫాతిమాను అంతం చేసేందుకు ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా షెహరాన్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్నీకుండ్ జలాశయానికి ఆమెను తీసుకెళ్లాడు. గతనెల 18న ఆ ప్రాంతానికి తీసుకెళ్లి.. స్నాక్స్, కూల్‌డ్రింక్ ఇప్పించాడు. స్నాక్స్ తింటూ, కూల్‌డ్రింక్ తాగుతూ ఉన్న ఫాతిమాను.. అదును చూసి గట్టుపై నుంచి జలాశయంలోకి తోసేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయాడు.