తెలంగాణ

telangana

ETV Bharat / crime

విజయవాడ డ్రగ్స్‌ కొరియర్‌ కేసు.. చెన్నైకి చెందిన వ్యక్తి అరెస్ట్​ - విజయవాడ మాదకద్రవ్యాల కేసు

Vijayawada Drugs case: ఆంధ్రప్రదేశ్ విజయవాడ డ్రగ్స్‌ ప్యాకెట్‌ కొరియర్‌ ఘటనలో చెన్నైకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. డీసీపీ మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు. చెన్నై నుంచి కొరియర్‌ చేస్తే తెలిసిపోతుందని విజయవాడను ఎంచుకున్నారని తెలిపారు.

Vja DCP on Drugs courier case
విజయవాడ డ్రగ్స్‌ కొరియర్‌ కేసు.. చెన్నైకి చెందిన వ్యక్తి అరెస్ట్​

By

Published : May 11, 2022, 2:34 PM IST

Vijayawada Drugs Case: ఆంధ్రప్రదేశ్ విజయవాడ డ్రగ్స్‌ ప్యాకెట్‌ కొరియర్‌ ఘటనకు సంబంధించి పోలీసులు చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నగరం నుంచి కొరియర్‌ ద్వారా ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్‌ అనే డ్రగ్‌ను పంపిన ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీసీపీ మేరీ ప్రశాంతి.. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడ నుంచి కొరియర్‌ చేసిన అరుణాచలాన్ని చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. రూ.45లక్షల విలువైన డ్రగ్స్​ రవాణా చేస్తూ దొరికినట్లు వివరించారు. చెన్నై బర్మా బజారులో అరుణాచలం పని చేస్తాడని డీసీపీ చెప్పారు. నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

జాగ్రత్తలు తీసుకోవాలని కొరియర్‌ సంస్థలను డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. గోపి సాయి ఆధార్‌ ఫోర్జరీ చేసి అరుణాచలం ఉపయోగించిట్లు పేర్కొన్నారు. ఆధార్ ఫోర్జరీపై విజయవాడ పోలీసులకు గోపి సాయి ఫిర్యాదు చేశాడని తెలిపారు. నిందితుడు అరుణాచలాన్ని ఫోర్జరీ కేసులో అరెస్ట్‌ చేశామన్నారు. డ్రగ్స్‌ కేసు మొత్తాన్ని బెంగళూరు కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. చెన్నై నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి విజయవాడ నుంచి కొరియర్‌ ద్వారా రవాణా చేసినట్లు వెల్లడించారు. విజయవాడ నుంచి కొరియర్‌ ద్వారా మాత్రమే పంపారని.. మరో ఇద్దరి పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. విదేశాలకు విజయవాడ నుంచి కొరియర్‌ చేసే కార్యాలయాలపై ఇకపై తనిఖీలు చేస్తామని ప్రకటించారు. చెన్నై నుంచి కొరియర్‌ చేస్తే తెలిసిపోతుందని విజయవాడను ఎంచుకున్నారని డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు.

అసలేం జరిగింది: బెజవాడ కేంద్రంగా మత్తు పదార్థాల సరఫరా విదేశాలకు చేరుతుంది. పార్శిళ్ల రూపంలో జరుగుతున్న డ్రగ్స్‌ దందా.. పోలీసులను ఆశ్చర్యపరుస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి.. ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 31న విజయవాడ భారతీనగర్‌లోని డీఎస్‌టీ కొరియర్‌ ద్వారా.. ఆస్ట్రేలియాకు ఓ పార్శిల్‌ను కొరియర్‌ చేశాడు. పార్శిల్‌ పంపడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరని కొరియర్‌ సంస్థకు చెందిన గుత్తుల తేజ సూచించాడు. స్పష్టత లేని ఓ ఆధార్‌కార్డు జిరాక్స్‌ను గోపీసాయి ఇచ్చాడు. అది పనికిరాదని, మరొకటి తీసుకురావాలంటూ తేజ చెప్పాడు. తన దగ్గర వేరే కార్డు లేదని, ఎప్పుడూ ఇక్కడి నుంచే కొరియర్‌ చేస్తానని నమ్మబలకడంతో.. తేజ తన ఆధార్‌ కార్డు నంబరుతో కొరియర్‌ను ఆస్ట్రేలియాకు బుక్‌ చేశాడు. కానీ.. పార్శిల్‌ మీద వివరాలు తప్పుగా ఉండడంతో అది కెనడా వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది.

బెంగళూరు విమానాశ్రయంలో ఆ పార్శిల్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దానిని తనిఖీ చేయగా.. 4.49 కిలోల ఎఫిడ్రిన్‌ అనే మత్తు పదార్థం ఉందని గుర్తించారు. పార్శిల్‌పై ఉన్న ఆధార్‌ కార్డు నంబరు ద్వారా గుత్తుల తేజను గుర్తించిన అధికారులు.. ఏప్రిల్‌ 27న బెంగళూరులో అదుపులోకి తీసుకుని 30న అరెస్ట్ చేశారు.

కేసులో ట్విస్ట్​: విజయవాడ నగరాన్ని వణికిస్తున్న మత్తు పదార్ధం ఎఫిడ్రిన్ సరఫరా కేసు కీలక మలుపు తిరిగింది. కేసులో కీలక నిందితుడు చెన్నై వాసిగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు . నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని చెన్నైకు పంపారు. భారతీనగర్ కొరియర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు . పార్శిల్ చేసిన నిందితుడి విజువల్స్ సేకరించారు . దీంతో పాటు కొరియర్ తేజకు ఇచ్చిన ఆధార్ జిరాక్స్​ను పరిశీలించారు. జిరాక్స్​లో అడ్రస్ గోపీసాయిది ఉన్నా.. ఫోన్ నెంబర్, ఫొటో వేరే వారిది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఫోన్ ఆధారంగా ట్రాకింగ్ చేస్తే చెన్నైలో ఉన్నట్లు తేలింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details