vijayawada bds student tapasvi murder: తపస్వి ప్రేమ వాస్తవాలు గుర్తించలేని గుడ్డిదైతే.. ప్రేమోన్మాది జ్ఞానేశ్వర్ ప్రేమ చెడ్డది. అతడి తండ్రి నూజివీడులో చిరుద్యోగి కాగా, తల్లి ఉపాధి హామీ పథకంలో మేస్త్రీ. చిన్న కుటుంబం నుంచి వచ్చిన జ్ఞానేశ్వర్.. బెట్టింగ్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఇంజినీరింగ్ తప్పాడు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన తపస్విని సాఫ్ట్ వేర్ ఉద్యోగినని నమ్మించాడు. ఆ స్నేహం ప్రేమగా మారడంతో తపస్వి తన ఆభరణాలు అమ్మి అతడికి బైక్, ఐవాచ్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలిసింది. కొంతకాలం వీరిద్దరూ గన్నవరంలో కలిసి ఉండగా, విభేదాలు ఏర్పడడంతో తపస్వి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అప్పటి నుంచి తపస్వి, జ్ఞానేశ్వర్‌కు మాటల్లేవు. బైకు, ఐవాచ్ తిరిగి ఇచ్చేయాలని ఆమె కబురు పంపడంతో.. ఐవాచ్ వెనక్కు ఇచ్చేశాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా స్పందించక పోయేసరికి కోపం పెంచుకున్నాడు. తపస్వితో మాట్లాడించాలని ఆమె స్నేహితురాలిని కోరినా ఫలితం లేకపోవటంతో కసి పెంచుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. తపస్వి బహుమతిగా ఇచ్చి వెనక్కు తీసుకున్న వాచీ ద్వారానే ఆమె ఆచూకీ కనిపెట్టిన జ్ఞానేశ్వర్.. విజయవాడలో రెండు సర్జికల్ బ్లేడ్లు కొని తక్కెళ్లపాడు వెళ్లాడు. ఆమె బహుమతిగా ఇచ్చిన బైక్ మీదనే వచ్చి తపస్విపై దాడి చేశాడు.