నడిరోడ్డుపై పట్టపగలు అందరూ చూస్తుండగానే... యువతిని దారుణంగా చంపాడు ఓ యువకుడు. దేశమంతటా స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న వేళ.. ఏపీలోని గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్ విద్యార్థిని రమ్య (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమ్య హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, 'దిశ' కింద చర్యలు తీసుకొని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
అడ్డుకున్న విపక్షాలు
విద్యార్థిని మృతదేహానికి గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష పూర్తయింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యులు యత్నించారు. అయితే జీజీహెచ్ వద్దకు వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తరలించకుండా విపక్షాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. యువతిని చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
జీజీహెచ్ వద్ద తెదేపా, వామపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు బైఠాయించి నిరసనకు దిగారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో మృతదేహాన్ని మరో మార్గం ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.