Vanasthalipuram Robbery Case Update: హైదరాబాద్ వనస్థలిపురంలో నాలుగురోజుల క్రితం జరిగిన దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొదట బాధితులు రూ. 2 కోట్లు పోయాయని ఫిర్యాదు చేయగా కేవలం 25 లక్షల రూపాయలే దోపిడీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఓ ఫ్లాట్ ఒప్పందం కోసం వెంకట్‌రెడ్డి అనే వ్యాపారి 50 లక్షల రూపాయలు తీసుకోగా... అతని నుంచి దుండగులు ఆ డబ్బును దోచుకెళ్లారు.
వెంకట్‌రెడ్డి పోలీసులకు 50 లక్షలు పోయాయని ఫిర్యాదు చేయగా అతనితో పాటు ఉన్న నరేష్ అనే వ్యక్తి కోటిన్నర పోయాయని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించగా సీసీ కెమెరాల ద్వారా 25 లక్షలు మాత్రమే పోయినట్లు గుర్తించారు. బాధితులు కావాలనే డబ్బులు ఎక్కువగా పోయాయని ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రస్తుతం డబ్బులు దోచుకెళ్లిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వెంకట్‌రెడ్డి ఆర్థిక లావాదేవీలపై పోలీసు బృందాలు విచారణ చేస్తున్నాయి. రేపు దోపిడి చేసిన నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.