Vanama Raghavendra remand: వనమా రాఘవేంద్రకు కోర్టు రిమాండ్ పొడిగించింది. గతంలో విధించిన 14 రోజులు రిమాండ్ గడువు ముగియడంతో రాఘవను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ మొదటిశ్రేణి కోర్టులో వర్చువల్‌గా హాజరుపర్చారు జైలు అధికారులు. కొవిడ్ ఆంక్షల వల్ల కోర్టు ఆన్‌లైన్‌లో విచారించింది. ఇప్పటికే విధించిన రిమాండ్ ముగియడంతో మరో 14 రోజులు పొడిందించింది. ఫిబ్రవరి 4 వరకు వనమా రాఘవ జైలులోనే ఉండనున్నారు.
ఈ నెల 3న భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణ.. అంతకుముందు తీసుకున్న సెల్ఫీవీడియోలో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అవమానం భరించలేక కుటుంబంతో సహా చనిపోతున్నట్లు రామకృష్ణ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన బయటికి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న రాఘవ ఆచూకీ కోసం పోలీసులు... రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు.. మందలపల్లి అడ్డరోడ్డు వద్ద రాఘవను పోలీసులు పట్టుకున్నారు. గతేడాది వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో రాఘవకు నోటీసులు ఇవ్వటం సహా.. రాఘవపై గతంలో నమోదైన కేసులను పోలీసులు వెలికితీస్తున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో వనమా రాఘవను పోలీసులు ఏ-2గా చేర్చారు.
సంచలనమైన సెల్ఫీ వీడియో..