తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిందితులు ఎవరైనా వదలిపెట్టం: ఐజీ - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్​ రావు, నాగమణి దంపతుల హత్య కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో కుంట శ్రీను ప్రధాన నిందితుడని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందన్నారు.

vaman rao couple murder case accuseds arrested
ప్రధాన నిందితుడు కుంట శ్రీను: పోలీసులు

By

Published : Feb 18, 2021, 8:54 PM IST

హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్​ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఎ-1 కుంట శ్రీను, ఎ-2 శివందుల చిరంజీవి, ఎ-3 అక్కపాక కుమార్‌గా ఐజీ పేర్కొన్నారు.సాంకేతిక పరిజ్ఞానంతో మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇద్దరు నిందితులను పట్టుకున్నామన్నారు.కుమార్​ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. న్యాయవాది వామన్‌రావు, కుంట శ్రీను మధ్య చాలా రోజులుగా వివాదాలు ఉన్నాయని.. ఊరిలోని భూముల విషయంలో ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది చెప్పారు.

ఆలయ భూమి విషయంలో ఇద్దరి మధ్య ప్రధాన వివాదం ఉందన్నారు. కుంట శ్రీనును పలు అంశాల్లో వామన్‌రావు న్యాయపరంగా అడ్డుకున్నారని వెల్లడించారు. ప్రాణభయం ఉందని వామన్‌రావు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదన్నారు. రక్షణ కల్పించాలని కూడా పోలీసులను ఎప్పుడూ కోరలేదని స్పష్టం చేశారు.

చిరంజీవికి కుంట శ్రీను కొన్నిసార్లు ఆర్థికసాయం చేశాడని తెలిపారు. కుంట శ్రీనుపై కొన్ని పాత కేసులు ఉన్నాయని.. కేసులో దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉందన్నారు. హత్య ఘటనను వీడియో తీసిన వారు పోలీసులకు అందించాలని కోరారు. వామన్‌రావు దంపతులను చంపినవారు ప్రొఫెషనల్‌ కిల్లర్స్ కాదని పేర్కొన్నారు. న్యాయవాదులకు ఇలాంటి పరిస్థితి ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు.

హత్య కేసులో వసంతరావు పాత్రపై విచారణ జరుగుతోందని.. కుంట శ్రీనుకు వసంతరావు కారు ఇచ్చారని వెల్లడించారు. హత్యలో ముఖ్యంగా కుంట శ్రీను, చిరంజీవి పాల్గొన్నారని.. ఈ ఇద్దరికి సహకరించిన కుమార్‌ను నిందితుడిగా చేర్చామన్నారు. వసంతరావు పాత్రపై ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. బిట్టు శ్రీను పాత్రపై కూడా దర్యాప్తులో తర్వాత స్పష్టత వస్తుందని...ఇతరుల పేర్లు ఇప్పుడే చెప్పలేమన్నారు. నిందితులు ఎంతటివారైనా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. హత్య వెనక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలియలేదని ఐజీ నాగిరెడ్డి తెలిపారు.

ప్రధాన నిందితుడు కుంట శ్రీను

ABOUT THE AUTHOR

...view details