తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆప్యాయత చూపి యువకుల వల.. అవాంఛిత గర్భంతో అమ్మాయిలు విలవిల - men cheat women

బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే వయసు. అంతా కొత్తగా ఉంటుంది. వేర్వేరు వ్యక్తుల పరిచయాలు.. అనేక ఆకర్షణలు. చదువుకునేటప్పుడో..కొలువుచేసే సమయంలోనో ప్రేమ, పెళ్లి వంటి మాయమాటలకు తలొగ్గిన ఆడపిల్లలు మాయగాళ్ల వలలో చిక్కుతున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు. వాస్తవం తెలుసుకునేలోపే కడుపులో మరోజీవి ఊపిరి పోసుకుంటోంది. మోసగించిన వాడు మాత్రం ముఖం చాటేస్తున్నాడు. ఆ తాలూకూ పర్యవసానాలు మాత్రం ఆడపిల్లలే అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పెద్దవాళ్లకు భయపడి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఉదంతాలూ ఉన్నాయి. మరికొందరు తమ భవిష్యత్తుకు అడ్డంకిగా మారతారనే ఉద్దేశంతో దూరప్రాంతాలకు వెళ్లి ప్రసవించి పురిటి బిడ్డలను వదిలేసి వస్తున్నారు.

అవాంఛిత గర్భంతో అమ్మాయిలు విలవిల
అవాంఛిత గర్భంతో అమ్మాయిలు విలవిల

By

Published : Nov 1, 2021, 6:41 AM IST

  • మిర్యాలగూడలో ఓ బాలిక(17)ను వివాహితుడైన దగ్గరి బంధువే లోబరుచుకున్నాడు. ఆ కారణంగా ఆమె గర్భం దాల్చింది. అతను ముఖం చాటేశాడు. ఆమె మాత్రం అతని పాపాన్ని నవమాసాలు మోసింది. చివరికి రహస్యంగా బిడ్డను ప్రసవించి.. ముళ్లపొదల్లో పడేసి, తాను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
  • ఇటీవల హైదరాబాద్‌లోని కోఠి మెటర్నిటీ ఆసుపత్రి వద్ద అప్పుడే పుట్టిన శిశువును వదిలివెళ్లిన మహిళను సీసీ కెమెరా పుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ప్రియుడు మోసం చేయటంతో కుమార్తె భవిష్యత్తుకు ఇబ్బందిగా భావించి తామే వదిలివెళ్లినట్టు బాలిక తల్లిదండ్రులు అంగీకరించారు.
  • సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన బాలిక(17), బాలుడు(15) శారీరకంగా దగ్గరయ్యారు. కుమార్తె గర్భవతి అని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ నగరం సైదాబాద్‌లో మంగళవారం ఈ ఘటన వెలుగుచూసింది.

తప్పటడుగులు వద్దు సుమా..

బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే వయసు. అప్పటిదాకా ఆంక్షల నడుమ పెరిగిన వారికి యవ్వనంలోకి రాగానే రెక్కలొచ్చినట్లు భావిస్తారు. కొత్త పరిచయాలు.. గమ్మత్తైన ఆకర్షణలు.. ఆకర్షణే ప్రేమ అనుకునే వయసులో తప్పటడుగు వేస్తున్నారు. మాయమాటలకు తలొగ్గి ఆడపిల్లలు మాయగాళ్ల వలలో చిక్కుతున్నారు. నిజం తెలుసుకనేలోగానే కడుపులో మరో ప్రాణం ఊపిరి పోసుకుంటోంది. ఏం జరిగిందో గ్రహించే లోగా.. దానికి కారణమైన వాడు ముఖం చాటేస్తున్నాడు. బిడ్డను చంపుకోలేక.. దూరప్రాంతాలకు వెళ్లి ప్రసవించి పురిటిలోనే బిడ్డను వదిలేస్తున్న వారు కొందరైతే.. బిడ్డను వదల్లేక ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు మరికొందరు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం వివిధ కారణాలతో కన్నవారికి దూరమైన 320 మంది పసికూనలు మాతా-శిశు సంక్షేమ కేంద్రాలకు చేరారు. వారిలో పోక్సో కేసుల్లో బాలికలకు పుట్టిన శిశువులు 30-40 మందికి పైగా ఉండటం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. ‘ఈ ఏడు వేర్వేరు కారణాలతో తలిదండ్రులకు దూరమైన, చెత్తకుండీల పాలైన 117 మంది పసికూనలకు ఒక్క హైదరాబాద్‌ మాతా-శిశు కేంద్రంలో ఆశ్రయం కల్పించాం. ప్రేమ ముసుగులోనో! మోసపోయో! గర్భం దాల్చిన వారు వదిలించుకున్న శిశువులే ఎక్కువగా ఉన్నారు. ఎక్కడెక్కడో మోసపోయిన వాళ్లు నగరంలో ప్రసవించి వదిలేస్తున్నట్టు మా పరిశీలనలో తేలింది’ అని హైదరాబాద్‌ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఇ.అక్కేశ్వర్‌రావు తెలిపారు.

వాళ్లు పంచుకోరు.. మనమే తెలుసుకోవాలి

‘యుక్తవయసు ఆడ పిల్లలు సిగ్గు, బిడియం..చెబితే పెద్దలు ఎలా ప్రతిస్పందిస్తారోననే భయంతో ప్రేమ, మోసపోవడం వంటి విషయాలు దాస్తారు. అటువంటి వారి మనసులో బాధను గుర్తించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని’ నిలోఫర్‌లోని యువకేంద్రం నోడల్‌ అధికారి డాక్టర్‌ హిమబిందు తెలిపారు. మహిళాశక్తి కేంద్రాలతో కలిసి బస్తీలతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నామని, అయినా కొందరు మోసపోతున్నారన్నారు. ‘జీవనశైలి, గుడ్‌/బ్యాడ్‌టచ్‌, ప్రేమ, ఆకర్షణ భావోద్వేగాలు వంటి అన్ని అంశాలనూ ఆడపిల్లలతో మాట్లాడాలి. తప్పటడుగు వేయకుండా తమను తాము అదుపుచేసుకునే మార్గాలను చూపాలి. కుటుంబ వాతావరణం బాగుండేలా చూడటం, తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు చాలా చిక్కుల నుంచి పిల్లలను బయటపడేస్తాయి’ అని ఆమె చెప్పారు.

ఆ బాధ్యత తల్లిదండ్రులదే

యట ప్రాంతాల్లో ఉంటే లైంగికదాడి జరుగుతుందనే అపోహలోనే పెద్దలు ఉండిపోయారు. వావివరసలు మరచిన అయినవాళ్లే తమ బిడ్డలను వేధింపులకు గురిచేస్తున్నారనే వాస్తవాన్ని గమనించట్లేదు. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేయాలంటే తల్లిదండ్రులు పిల్లలకు తప్పొప్పులను విడమరిచి చెప్పాలి. సున్నితమైన అంశాలను ఎలా చెప్పాలో తెలియని వారు నిపుణుల సాయం తీసుకోవాలి. ఆడపిల్లలంటే బలహీనులు అనే భావనను తొలగించాలి. మానసికంగా, శారీరకంగా తమను తాము కాపాడుకునేలా వారిని తీర్చిదిద్దాలి. అన్ని విషయాలూ పంచుకునే స్వేచ్ఛను బిడ్డలకు ఇవ్వాలి. అమ్మానాన్నలతో పంచుకుంటే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం కలిగించాలి.

శిశువిహార్‌లో వదిలేస్తే కాపాడతాం

మానవత్వం లేకుండా, శిశువుల ప్రాణాలకు అపాయమని తెలిసినా ప్రమాదకర ప్రదేశాల్లో వదిలేసి వెళ్లటం బాధాకరం. పిల్లలు భారమని భావిస్తే శిశువిహార్‌లో వదిలేయండి. ఎందుకు తీసుకొచ్చారనే అంశాలను ఆరాతీయం. శిశువులను కంటికిరెప్పలా కాపాడతాం. భావిభారత పౌరుల్లా తీర్చిదిద్దుతాం.

ABOUT THE AUTHOR

...view details