ముక్కుపచ్చలారని శిశువును పూడ్చివేయాలని ఆంధ్రప్రదేశ్లో విశాఖలోని జ్ఞానాపురం శ్మశానవాటికకు తీసుకువచ్చిన ఘటన కలకలం రేపింది. విశాఖ కాన్వెంట్ జంక్షన్లోని హిందూ శ్మశాన వాటికకు శనివారం సాయంత్రం AP31 DF 0741 నంబర్ కారులో నలుగురు వ్యక్తులు వచ్చారు. పాప చనిపోయిందని.. పూడ్చివేయాలని శ్మశానవాటిక సిబ్బందితో చెప్పారు. ఏ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారని శ్మశాన వాటిక ఇన్ఛార్జ్ ప్రశ్నించడంతో రైల్వే న్యూకాలనీలోని కృష్ణా మెటర్నిటీ నర్సింగ్ హోమ్ నుంచి తెచ్చామంటూ.. ఓ లేఖను ఆయన చేతిలో పెట్టారు. కవర్లో ఉన్న శిశువును శ్మశాన వాటిక సిబ్బందికి అందించారు. శిశువును పూడ్చటం కోసం సిబ్బంది కవర్ తెరవగా.. ఒక్కసారిగా శిశువు ఏడవటం ప్రారంభించింది. దీంతో ఆశ్చర్యానికిలోనైన సిబ్బంది.. తేరుకుని ఆ నలుగురినీ నిలదీశారు. దీంతో వారు అక్కడ నుంచి జారుకున్నారు. ఆ వ్యక్తుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన శ్మశాన వాటిక సిబ్బంది వారు చెప్పిన ఆసుపత్రికి శిశువును తీసుకెళ్లారు.
ఆసుపత్రికి వెళ్లి నిలదీత..
వెంటనే శ్మశానవాటిక సిబ్బంది శిశువును సంబంధిత ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆ ఆసుపత్రి సిబ్బంది సైతం దురుసుగా ప్రవర్తించారు. బిడ్డను ఆసుపత్రిలో వదిలి బయటికి వెళ్లమంటూ కసురుకోవడంతో బిడ్డను ఆసుపత్రిలో వదిలి.. శ్మశాన వాటిక సిబ్బంది బయటికి వచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం దురుసుతనం, శిశువును తీసుకువచ్చిన వారు పరారవడం కొత్త ప్రశ్నలకు తెరలేపింది. రోజల చిన్నారిని కవర్లో పెట్టి తీసుకురావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.