హైదరాబాద్ శివారులో వరుసగా గుర్తు తెలియని మృతదేహాలు(unknown dead bodies in hyderabad) లభ్యమవుతున్నాయి. ఈ నెల 12వ తేదీన రెండు శవాలను పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ బాహ్య వలయ రహదారి సర్వీస్ రోడ్డు నుంచి కోహెడ వెళ్లే దారి సమీపంలోని కాలువలో.... వివాహిత మృతదేహం దొరికింది. మృతురాలు వయస్సు 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. మహిళ మృతికి గల కారణాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి డాగ్ స్క్వాడ్‌తో పాటు క్లూస్ టీంలను తీసుకువచ్చి ఆధారాలు సేకరించారు. హత్య చేసి కాలువలో పడేశారా....? లేదా ఆత్మహత్యా... ? అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే... అసలు నిజాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఎల్బీ నగర్‌లోని బైరామల్ గూడ వద్ద నాలాలో అదేరోజు ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. యువకుడి ముఖం చిధ్రమై గుర్తుపట్టని స్థితిలో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యా...? ఆత్మహత్యా..? తేల్చలేకపోయిన పోలీసులు పోస్టుమార్టం నివేదకతోనే నిర్ధారణవుతుందని వెల్లడించారు. గతంలో పాతబస్తీలో ఇదే నాలా పక్కన హత్య చేసి తగులపెట్టిన ఘటనలు ఉండటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరోవైపు.. మంగళవారం ఇబ్పహీంపట్నం శేరిగూడాలోని ఓ వెంచర్‌లో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటం పోలీసులు గుర్తించారు. పక్కనే కత్తి, ఖాళీ మద్యం సీసా పడి ఉండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. వారం రోజులుగా వెంచర్‌కు ఎవరెవరూ వచ్చార అనే వివరాలు సేకరించి కేసును తేల్చే పనిలో పడ్డారు.