Father in law kills daughter in law: మంచిర్యాల జిల్లాలో దారుణం ఘటన జరిగింది. ఓ మామ తన కోడలిని అత్యాంత కిరాతకంగా హతమార్చాడు. కోటపల్లి మండలం లింగన్నపేటలో కలకలం రేగింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. లింగన్నపేటకు చెందిన సాయికృష్ణ, సౌందర్య ప్రేమించుకున్నారు. కులాలు కావడంతో వీరిద్దరి వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఐదు నెలల క్రితం వీరు పెళ్లిచేసుకొని.. మంచిర్యాలలో కాపురం పెట్టారు. అనంతరం స్వగ్రామానికి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. అయితే వివాహం జరిగిన రెండు నెలలకే సాయికృష్ణ మద్యానికి బానిసయ్యాడు. అనంతరం కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే భర్త మరణించాక సౌందర్య.. అదే ఊరిలో ఉంటున్న తల్లి వద్దే ఉంటోంది. తన కుమారుడు ఆత్మహత్యకు కోడలే కారణమని భావించిన సాయికృష్ణ తండ్రి తిరుపతి.. ఆమెపై పగ పెంచుకున్నాడు. ఇవాళ ఉదయం... ఇంట్లో సౌందర్య ఒంటరిగా ఉందని తెలుసుకున్న మామ తిరుపతి.. అక్కడికి వెళ్లాడు. ఆమెపై దాడి చేసేందుకు యత్నించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్య తండ్రి లక్ష్మయ్య దాడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించగా.. అతన్నీ గాయపరిచాడు. ఆ వెంటనే సౌందర్య గొంతుకోసి అత్యంత కిరాతకంగా హత్యచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు.