ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో పండగ పూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు కాలువలో స్నానానికి దిగి ప్రాణాలు విడిచారు. కేతవరం గ్రామానికి చెందిన ముఖేష్ (22), అతని అన్న కుమారుడు గణేశ్ (19) మరికొంత మంది స్నేహితులతో కలిసి గంగవరం - రాజవరం గ్రామాల శివారులోని ఎర్ర కాలువ వద్ద స్నానానికి వెళ్లారు. ముందుగా గణేశ్, ముఖేశ్తోపాటు మరో స్నేహితుడు పవన్ కాలువలోకి దిగారు. కాలువలో లోతు ఎక్కువగా ఉందని పవన్ హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా ఇరువురూ లోపలికి వెళ్లారు.
ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు..
దీంతో.. ఇద్దరూ మునిగిపోయారు. వారిని కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వారు నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు కాలువ వద్దకు చేరుకొని భోరున విలపించారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. మృతదేహాలను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.