సాంబార్ గిన్నెలో పడి చిన్నారి మృతి.. - Two-year-old child dies after falling into sambar bowl

23:07 February 14
సాంబార్ గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి..
తన ముద్దు ముద్దు మాటలతో ఆ ఇంట సంతోషాన్ని పంచిన ఆ చిన్నారి.. అంతలోనే అందరినీ విషాదంలో ముంచింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలోని కలగర ఎస్సీ వాడలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన కారుమంచి శివ, బన్ను దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో తేజశ్విని(2) గత ఏడాది కాలంగా సత్తుపల్లిలోని అమ్మమ్మ వద్ద ఉంటోంది. శివ సోదరుడు రవికి ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్దకుమార్తె పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. తేజశ్వినిని కూడా శివ తీసుకొచ్చారు. రోజంతా తన అమ్మానాన్నలతో పాటు, అక్కలు, పెద్దమ్మ, పెదనాన్న, నానమ్మ, తాతలతో కలసి తీయని అనుభూతులు పంచుకుంది. వచ్చీరాని మాటలతో సందడి చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తల్లి బన్ను చేతిలో గోరుముద్దలు తింటూ ఆటలాడుకుంటున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అక్కాచెల్లెళ్లందరికీ కలిపి అన్నం తినిపిస్తున్న తల్లి పక్కకు వెళ్లిన సమయంలో ఆటలాడుకుంటున్న తేజశ్విని అప్పుడే కాచిన వేడి సాంబారు గిన్నె వద్ద సంచరిస్తూ వచ్చీ రాని నడకతో తూలి, గిన్నెపై సగం తెరచిన మూతపై చేతులేసి పట్టుజారి అందులో పడిపోయింది. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా మృత్యువుతో పోరాడుతూ సోమవారం తెల్లవారుజామున మరణించింది. ఈ వార్త జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. చిన్నారి మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది.
ఇదీ చూడండి: పాఠాలు చెప్పాల్సిన నోటి నుంచి కామపురాణం.. వెలుగులోకి ఆడియో
TAGGED:
chinnari