డ్రైనేజి క్లీన్ చేస్తూ... ఇద్దరు ఒప్పంద కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో చోటుచేసుకుంది. సాహెబ్ నగర్లో డ్రైనేజి క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్ లోపలికి దిగిన అంజయ్య, శివలు గల్లంతయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గంట పాటు శ్రమించిన పోలీసు బృందాలకు శివ మృతదేహం లభ్యమైంది.
భద్రతా చర్యలు తీసుకోలేదా?
అంజయ్య మృతదేహం కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా మ్యాన్ హోల్లోకి దిగటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. రాత్రి వేళల్లోనే ఇలాంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు పరిహారం అందించి న్యాయం చేయాలని కోరారు.