మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఎస్‌ఆర్పీ-3 బొగ్గు గనిలో పైకప్పు కూలిన ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా బొగ్గు గని పైకప్పు కూలింది. ఆ సమయంలో గనిలో పని చేస్తున్న కృష్ణారెడ్డి(59), లక్ష్మయ్య(60), చంద్రశేఖర్(29), నర్సింహరాజు(30) ప్రాణాలు కోల్పోయారు. సింగరేణి రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టి మృతదేహాల్ని వెలికితీసింది. మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపించడం అందరిని కంటతడి పెట్టించింది. మృతదేహాలను తరలిస్తున్న క్రమంలో సింగరేణి యాజమాన్యానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Singareni: సింగరేణి గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు దుర్మరణం - telangana news updates
12:50 November 10
సింగరేణి గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి
అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. హత్య నేరం కింద శిక్షించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు సింగరేణి ఇచ్చే బెనిఫిట్స్ కాకుండా అదనంగా కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గని వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై సింగరేణి సీఎండీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి వారు కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పిస్తామని సీఎండీ ప్రకటించారు. మృతి చెందిన కార్మికులకు యాజమాన్యం తరఫున చెల్లించే మ్యాచింగ్ గ్రాంట్, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని సుమారు రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అందజేయనున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: