ఓ సూక్ష్మరుణ సంస్థ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరించడం.. అత్తాకోడళ్ల ప్రాణాలు తీసింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ గ్రామంలోని సుందర వెంకటేశ్వరరావు, రవిబాబు తండ్రీకుమారులు. రవిబాబు భవన నిర్మాణ కార్మికుడు. వారు ఇంటి నిర్మాణం కోసం రెండు ప్రైవేట్ సూక్ష్మరుణ సంస్థల వద్ద.. ఐదేళ్ల క్రితం రుణం తీసుకున్నారు. రుణ వాయిదాలు సక్రమంగానే చెల్లిస్తూ వచ్చారు.
ఈ క్రమంలోనే ఫుల్ట్రాన్ సంస్థలో తీసుకున్న రుణం రూ.5.50 లక్షలకు గానూ.. నెలకు రూ.12,500 చొప్పున చెల్లిస్తున్నారు. కానీ ఈ నెల 7న చెల్లించాల్సిన వాయిదా ఆలస్యమైంది. దీంతో ఆ సంస్థ ఉద్యోగులు ఇంటికి వచ్చి గొడవకు దిగారు. వెంటనే డబ్బులు చెల్లించకపోతే ఇంటికి తాళం వేసి.. వేలం వేస్తామని బెదిరించారు. ఆందోళన చెందిన రవిబాబు భార్య భారతి శనివారం గుండెపోటుతో మరణించింది. కోడలి మరణంతో కలత చెందిన అత్త అంజమ్మ.. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.