Drugs Smuggling : మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఏపీకి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి డ్రగ్స్, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ.2.35 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఈ నెల 28న మధ్యాహ్నం చౌటుప్పల్ బస్టాండ్ వద్ద లారీని ఆపి సూర్యసంపత్, దీపక్ ఫణీంద్రలను అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దపూడి మండం గొల్లలమామిడాడకు చెందిన వట్టూరి సూర్యసంపత్, రాజమహేంద్రవరంలోని మోరంపూడి సాయినగర్‌కు చెందిన తీగల దీపక్ ఫణీంద్ర సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. గతకొంతకాలంగా రాజమహేంద్రవరం నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్న వీరు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఈ నెల 25న గోవాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి వద్ద ఎండీఎంఏ డ్రగ్స్(25 మాత్రలు), ఎల్‌ఎస్‌డీ(2 స్ట్రిప్స్) కొనుగోలు చేశారు. అనంతరం అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకున్న వీరు పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగు రోడ్డు వద్ద లారీ ఎక్కి రాజ మహేంద్రవరానికి బయలుదేరారు. నిందితులు డ్రగ్స్ తీసుకోవడంతో పాటు ఇతరులకు విక్రయిస్తారని వివరించారు. ఆదివారం రాత్రి చౌటుప్పల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట నిందితులను హాజరుపరిచి నల్గొండ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.