వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. పిల్లల చదువుల కోసం బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకొస్తుండగా ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని ముబారక్ పూర్ గేట్ సమీపంలో ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో నవాబుపేట మండలం పుల్మామిడి గ్రామానికి చెందిన ప్రభాకర్(43), అతని భార్య చంద్రకళ(40) ప్రాణాలొదిలారు.
రోడ్డుప్రమాదంలో తల్లిదండ్రులు మృతి.. అనాథలైన పిల్లలు - వికారాబాద్‌లో జిల్లాలో రోడ్డు ప్రమాదం
పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు. వారి జీవితాలు బాగుండాలని ఆశించారు. బిడ్డల చదువుల ఫీజు కోసమే బ్యాంకుకు బయలుదేరారు. డబ్బులు తీసుకుని ఇంటికి వస్తుండగా అంతలోనే వారిని మృత్యువు కబళించింది. ఈ ఘటనతో వారిద్దరి కుమారులు అనాథలుగా మిగిలారు. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా ముబారక్ పూర్ గేట్ సమీపంలో జరిగింది.
రోడ్డుప్రమాదంలో తల్లిదండ్రులు మృతి.. అనాథలైన పిల్లలు
పిల్లల చదువులు కోసమే గ్రామాన్ని వదిలి శంకర్‌పల్లిలో నివాసముంటున్నారని బంధువులు తెలిపారు. ప్రతి రోజు బైక్‌పైనే సొంత గ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు చూసుకుని సాయంత్రం తిరిగి శంకర్ పల్లికి తిరిగి వెళ్ళేవారని చెబుతున్నారు. వారికి శివకుమార్ (16), ధనుష్ కుమార్ (12) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారు అనాథలయ్యారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.