మహిళల ఆత్మగౌరవానికి భంగం కల్గించే మరో ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. చుట్టూ పొంచి ఉన్న పోకిరీలతో ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ఏదో ఓ రూపంలో మహిళలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పోకిరీల వికృత చేష్టలతో.. ఎక్కడికి వెళ్లిన సేఫ్టీ అనే మాటకు గ్యారంటీ లేదు అనే నిర్ణయానికి మహిళాలోకం వచ్చేలా చేస్తున్నారు. షాపింగ్ మాల్‌లో దుస్తులు ట్రయల్ చేసుకుంటుండగా.. ఇద్దరు పోకిరీలు వీడియో తీసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పార్టీషన్ పై నుంచి..
జూబ్లీహిల్స్‌లోని హెచ్ఆండ్ఎం షాపింగ్‌మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మాల్కి వచ్చిన ఓ యువతి దుస్తులు ట్రయల్ చేసేందుకు డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లింది. ఇది గమనించిన ఇద్దరు యువకులు.. ఆ యువతి వెళ్లిన గదికి ఆనుకుని ఉన్న మరో డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లారు. పార్టీషన్ పై నుంచి... యువతి బట్టలు మార్చుకుంటుండగా... చరవాణిలో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. చరవాణిని గమనించిన యువతి.. మొదట కేకలు వేసింది. అక్కడున్నవారు వెంటనే అప్రమత్తమై ఇద్దరు యువకులను పట్టుకున్నారు. అనంతరం డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ముగ్గురిపై కేసు..
సత్వరమే స్పందించిన పోలీసులు హెచ్ఆండ్ఎం షాపింగ్‌మాల్‌కు చేరుకొని సదరు యువకులు కిరీట్ అసాట్, గౌరవ్ కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీడియో తీసేందుకు ఉపయోగించిన చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాపింగ్‌మాల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. స్టోర్‌రూం మేనేజర్ అమన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.