Loan Apps Case: హైదరాబాద్ రేతిబౌలికి చెందిన ఓ మహిళ తన అవసరాల కోసం అధిక వడ్డీకి పలు రుణయాప్‌ల నుంచి సుమారు 2లక్షలు రుణం తీసుకుంది. చెల్లింపులో ఆలస్యం కావడంతో కాల్ సెంటర్ల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు సహచర ఉద్యోగులకు ఫోన్లు చేసి ఆమెను కించపరిచారు. ఆమె ఫోన్ నంబరును 500 మందికి యువకులకు ఇచ్చారు. వారి నుంచి అసభ్యంగా ఫోన్లు రావడంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షన్నర తీసుకున్న మరో బాధితుడిని ఏకంగా అతను చనిపోయినట్లుగా శవానికి ఫోటోను మార్ఫింగ్ చేసి పంపించారు. ఆందోళనకు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు బెంగళూరు కేంద్రంగా ఓ కాల్ సెంటర్ పై దృష్టి సారించి.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
ఒడిశాకు చెందిన షబ్బీర్ అలాం, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఉమాకాంత్ యాదవ్‌లు చెన్ చౌపింగ్ ఆదేశాలతో బెంగళూరులోని కోరమాండల ప్రాంతంలో వంద మంది ఉద్యోగులతో కాల్ సెంటర్ తెరిచారు. ఓషన్ రూపీ, లైఫ్ వ్యాలెట్, మాలో వ్యాలెట్, ఎలిఫెంట్ క్యాష్, బాక్స్ క్యాష్, దత్త రూపీ యాప్ కాల్ సెంటర్ ద్వారా కస్టమర్లకు ఫోన్లు చేసి ఎలా డబ్బు రాబట్టాలో వారికి శిక్షణ ఇచ్చారు. వరుస ఫిర్యాదులతో దర్యాప్తు చేసిన పోలీసులు కాల్ సెంటర్‌పై సైబర్ క్రైం పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి నోటీసులు జారీ చేశారు. నిందితుల నుంచి 63ల్యాప్‌టాప్‌లు, 19చరవాణులు, 2 డెబిట్ కార్డులు సీజ్ చేశారు. వీరిపై గతంలోనే పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు.