వివాహేతేర సంబంధం ఇంట్లో తెలిసిందని.. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన కత్తుల సంతోష్(30)కు పెళ్లై.. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. కూలీ పని చేసుకునే సంతోష్... కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం సంతోష్ భార్యకు తెలిసింది. ఆమెతో కలిసి కూలీకి ఎందుకు వెళ్తున్నావని ఈనెల 22న భర్తను నిలదీసింది. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది జరిగిన రోజు రాత్రి సంతోష్.. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆమె కూడా అదే రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబ సభ్యులు తెలిసిన చోట్లన్నీ వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మూడు రోజులకు వాళ్లిద్దరి మృతదేహాలు పోచారం ప్రాజెక్టులో లభ్యమయ్యాయి.