తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accident : ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా.. ఇద్దరి దుర్మరణం, ఏడుగురికి గాయాలు - తెలంగాణ వార్తలు

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి. మొత్తం 30 మంది దూరప్రాంతానికి కూలి పనులకు వెళుతుండగా ప్రమాదం రూపంలో మృత్యువు ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తాపడి ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. మరొకరు కోమాలోకి వెళ్లారు. 44వ నంబరు జాతీయ రహదారిపై ఈ విషాదం చోటుచేసుకుంది.

Accident
ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా

By

Published : Oct 25, 2021, 8:53 AM IST

కూలిపనులు చేసుకుని.. డబ్బులు తీసుకుని.. ఆ పూట సంతోషంగా గడిపే కుటుంబాలు అవి. కానీ ఓ ప్రమాదం రెండేళ్ల కుమారుడికి తన తల్లిని దూరం చేసింది. కూతురుకి మంచి జీవితం ఇవ్వాలి.. ఒక అయ్య చేతిలో పెట్టాలి అని డబ్బులు సంపాదించే తల్లిదండ్రులకు.. ఆ కుమార్తె లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద, పెద్దకడబూరు మండలం రంగాపురం గ్రామాలకు చెందిన 30 మంది కూలీలు పిల్లలతో సహా సంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు పత్తి పొలాల్లో పనులు చేయడానికి ట్రాక్టర్‌లో శనివారం రాత్రి బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయానికి ట్రాక్టర్‌ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలియంకొండ వద్దకు చేరింది. అక్కడ ట్రాక్టర్‌ అదుపు తప్పి రహదారి పక్కన దిగువకు వెళ్లిపోగా.. డ్రైవర్‌ రామాంజీ రోడ్డుపైకి తిప్పే ప్రయత్నంలో ట్రాలీ బోల్తా పడింది. దీంతో ఉరుకుందకు చెందిన దీపిక(19) అక్కడికక్కడే మృతి చెందగా, నాగవేణి(25), సునీల్‌కుమార్‌, సుజాత, ప్రభావతి, కుబేరా, రుబేనా, మేరీ, వీరన్న గాయపడ్డారు.

స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై నాగశేఖరరెడ్డి, రహదారి నిర్వహణ సంస్థ అధికారులు అక్కడకు చేరుకొని బాధితులను వనపర్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వీరన్న, నాగవేణి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ నాగవేణి(రంగాపురం) మృతి చెందింది. వీరన్న కోమాలోకి వెళ్లాడు. నాగవేణికి భర్త, చిన్న బాబు ఉన్నారని బంధువులు తెలిపారు. ఈ ఘటనలో దీపిక తల్లి (సుజాత), సోదరుడు (సునీల్‌కుమార్‌) గాయాలపాలవ్వగా, ఆమె తండ్రి విజయ్‌కుమార్‌ క్షేమంగా బయటపడ్డారు.

దీపిక పెళ్లికి డబ్బు కూడబెట్టాలని..

వచ్చే ఏడాది దీపిక వివాహం చేయాలనే లక్ష్యంతో.. డబ్బు కూడబెట్టేందుకు కూలి పనులకు అంతదూరం ప్రయాణమయ్యామని, ఇప్పుడు ఆమెనే కోల్పోయామని యువతి తల్లిదండ్రులు, బంధువులు రోదించారు. ప్రమాద సమయంలో ఉన్న మొత్తం 30 మందీ బంధువులమేనని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details