హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ముల్కలగూడెంలో విషాదం చోటుచేసుకుంది. బుద్ధిగా ఉండాలని మందలించినందుకు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన కొడుకును కాపాడే ప్రయత్నంలో తండ్రి, అతని సోదరుడు మృతి చెందారు.
గ్రామానికి చెందిన విజేందర్.. తన కుమారుడు శ్రవణ్‌ను అల్లరి పనులు మాని.. బుద్ధిగా ఉండాలంటూ మందలించాడు. మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లోంచి వెళ్లి.. చనిపోతానంటూ తండ్రి, అతడి పెదనాన్న కుమారుడికి ఫోన్ చేసి బెదిరించాడు. చెరువులో దూకుతానని భయపెట్టడంతో.. తండ్రి విజేందర్, అతడి అన్న కుమారుడు శోభన్‌తో కలిసి చెరువు గట్టుకు వెళ్లారు. వారి ముందే శ్రవణ్ చెరువులో దూకడంతో.. ఏమీ ఆలోచించకుండా వారిద్దరూ చెరువులో దూకారు. కానీ.. కన్నపేగును కాపాడుకుందామన్న ఆ తండ్రి తపన.. సోదర బంధాన్ని నిలబెట్టుకుందామనుకున్న ఆ అన్న ప్రయత్నం.. ఇరువురి ప్రాణాలనూ బలి తీసుకుంది.
అతడు సేఫ్.. కానీ వారిద్దరూ..!
చెరువులో దూకిన శ్రవణ్ తనకు ఈత రావడంతో.. ఒడ్డుకు చేరుకున్నాడు. కానీ అతడిని కాపాడేందుకు చెరువులో దూకిన తండ్రి, సోదరుడు.. ఈత రాక చెరువులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలారు. యువకుడి అనాలోచిత, ఆకతాయి బెదిరింపులు.. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఒకే రోజు ఇద్దరిని కోల్పోయిన ఆ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.