తెలంగాణ

telangana

ETV Bharat / crime

సరదాగా చూసేందుకని వెళ్లి.. కృష్ణానదిలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి - సరదాగా చూసేందుకు వెళ్లి

బంధువులు దేవర చేసుకుంటే వచ్చారు. పిల్లలంతా సరదాగా బయటికి వెళ్దామంటే.. అందరినీ తీసుకుని ఓ వ్యక్తి కృష్ణానది ఒడ్డుకు తీసుకెళ్లాడు. నీళ్లను చూసిన ఆనందంలో పిల్లలంతా నదిలో దిగి కేరింతలు కొట్టారు. ఆ ఆనందం వాళ్ల ముఖాల్లో ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాత ఏమైందంటే..?

two kids died due to drown in Krishna river at maramunagala
two kids died due to drown in Krishna river at maramunagala

By

Published : Jun 8, 2022, 10:35 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉండవెల్లి మండలం మారమునగాల-1లో నిన్న(జూన్​ 7) జరిగిన జమ్ములమ్మ దేవరకు చేసుకుంటే చుట్టాలంతా వచ్చారు. అందులో నరసింహ అనే వ్యక్తి.. తొమ్మిది మంది పిల్లలను కారులో ఎక్కించుకొని సరదాగా కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్లాడు. నదిని చూసిన ఆనందంలో.. పిల్లలందరూ స్నానం చేయడానికి నీళ్లలోకి దిగారు. అందులో చరిత, మాధవి అనే చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన సదరు వ్యక్తి.. మిగతా పిల్లలను ఒడ్డుకు చేర్చి.. నీటిలో మునిగిపోయిన చరిత, మాధవిని కాపాడేందుకు ప్రయత్నించాడు.

ఎంతసేపు వెతికినా.. లాభం లేకపోయింది. పిల్లలిద్దరు నీటిలో గల్లంతయ్యారు. చిన్నారులు గల్లంతయిన విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయడంతో అందరూ వచ్చి నదిలో గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికీ పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మారమునగాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు కళ్లముందు ఆడుకున్న పిల్లలు.. విగత జీవులుగా మారడం బంధువులను కలిచివేసింది. ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న ఉండవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details