Hanamkonda Accident Today : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బొలెరో వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బొలేరో డ్రైవర్ సహా మరొకరు వాహనంలోనే చిక్కుకున్నారు. వారిని కష్టంమీద బయటకు తీశారు. అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ప్రాణాలు తీసిన అతివేగం
Panthini Accident News : అతి వేగమే వారి పాలిట శాపమైంది. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీకొని ఏడుగురు దుర్మరణం చెందారు. పెద్దకొడప్‌గల్ మండలం జగన్నాథపల్లి గేట్ వద్ద శనివారం మధ్యాహ్నం ఈ ఘోరప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు మరణించగా.. మరో అయిదుగురు తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో హుస్సేన్ (27), ఆయన భార్య తస్లీమా బేగం (25), అతడి స్నేహితుడు మహ్మద్ అమీర్‌తాజ్ (28), భార్య సనా ఫర్వీన్ (20), వీరి పిల్లలు హురియా ఫాతిమా (ఏడాదిన్నర), హనన్‌ఫాతిమా (4 నెలలు) ప్రమాద స్థలిలోనే ప్రాణాలు విడిచారు. తీవ్రగాయాల పాలైన మహ్మద్‌హుస్సేన్ కుమార్తె హూరా బేగం (5) చికిత్స పొందుతూ కన్నుమూసింది. హజీరా బేగం (9), హాదీ (8), హిబా బేగం (4), సుల్తాన్‌హుస్సేన్ (3)లతో పాటు అమీర్‌తాజ్ బంధువు ఆస్మా (12)లు నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రోడ్లు.. రక్తసిక్తం..
హైదరాబాద్ పరిధిలోని చాదర్‌ఘాట్-మూసానగర్, వినాయకవీధి-రసూల్‌పురాలకు చెందిన మహ్మద్‌హుస్సేన్-మహ్మద్ అమీర్‌తాజ్‌లు స్నేహితులు. ఇరు కుటుంబాలకు చెందిన 12 మంది కలిసి వాహనంలో శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని కందార్ దర్గాకు వెళ్లారు. శనివారం ఉదయం దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. వారంతా కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలం జగన్నాథపల్లి గేట్ సమీపంలోకి రాగానే ఎస్‌ఎన్‌ఏ (సంగారెడ్డి-నాందేడ్-అకోలా) 161వ జాతీయ రహదారి పక్కన ఆపి ఉన్న లారీని ఢీకొట్టారు ఇంటికి తొందరగా చేరుకోవాలని వారు వేగంగా ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో వీరి క్వాలిస్ వాహనం నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఒక చిన్నారి ఆసుపత్రిలో కన్నుమూసింది. మిగిలిన వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది.