మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే పట్టాలపై బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తిని కాపాడటానికి యత్నించిన అతడి మిత్రుడు కూడా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన.. ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
కుటుంబ కలహాలతో..
పాత నారపల్లికి చెందిన గ్యార ఉపేందర్(25) పోచారం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. సురేందర్‌రెడ్డి నగర్‌కు చెందిన జానీ(30), ఉపేందర్ చిన్ననాటి నుంచి స్నేహితులు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతోన్న జానీ.. ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంకాలం తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. అతడి స్నేహితుడైన ఉపేందర్‌కు సమాచారం అందించారు.
స్నేహితుడిని కాపాడబోయి..
స్థానికంగా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో ఉపేందర్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి.. అనుమానంతో రాత్రి 8:30 గంటల ప్రాంతంలో యానంపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. బలవన్మరణానికి పాల్పడి.. పట్టాల పక్కనే కొన ఊపిరితో పోరాడుతోన్న జానీని చూశారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రమాదవశాత్తు అటుగా వేగంగా వచ్చిన రైలు ఉపేందర్‌ను ఢీకొంది. తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
అప్పటికే పరిస్థితి విషమించిన జానీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. జానీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపేందర్‌కు వివాహం కావాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహితుల మృతితో నారపల్లిలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి, తోటి సిబ్బంది మృతుల నివాసాలకు వెళ్లి.. పరామర్శించారు.
ఇదీ చదవండి:Viral video: భార్యను చంపి సూట్‌కేసులో ప్యాకింగ్.. వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియో